టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : పరిటాల

Jan 4,2024 21:40

 సమస్యలు అడిగి తెలుసుకుంటున్న పరిటాల శ్రీరామ్‌ 

                       ధర్మవరం టౌన్‌ : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆపార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్రకు తొలిరోజే ప్రజలు, టీడీపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. ధర్మవరానికి ఒక మ్యానిపేస్టో తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పరిటాలశ్రీరామ్‌ ప్రజాచైతన్య పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం గుట్టకిందపల్లిలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజలు పరిటాల శ్రీరామ్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ టీడీపీ హాయాంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపామని, ఆ తీర్మానంలో తొలిసంతకం చేసింది మాజీ మంత్రి పరిటాలను సునీత అని గుర్తుకు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రతి రోజు గుడ్‌మార్నింగ్‌ అంటూ రెండుగంటలపాటు ఉదయం షో చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజాసమస్యలు మీద నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడో సమస్యలను పరిష్కరించేవారన్నారు. ఆయనకు చిత్తశుద్దలేని కారణంగానే పాదయాత్ర తొలిరోజే వందలాది మంది తమ సమస్యలు వినిపిస్తున్నారన్నారు. ప్రజలనుంచి వచ్చిన ప్రతి సమస్యను గుర్తుపెట్టుకొని టీడీపీ అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️