పట్టణ ప్రణాళిక విభాగంలో రాజకీయ పెత్తనం…

Dec 10,2023 20:52

మున్సిపల్‌ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం

                          హిందూపురం :పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వార్డుల వారిగా సచివాలయ వ్యవస్థను తీసుకోచ్చి, ప్రతి సచివాలయానికి ప్లానింగ్‌ సెక్రేటరీలను నియమించడంతో పాటు వీరిపై పెత్తనం చెలయించడానికి టిపిఒ, ఎసిపిలను నియమించినప్పటికి హిందూపురం పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు ఆగడం లేదు. చివరకు మున్సిపల్‌ ఆస్తులను సైతం కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం చేసి ధారదత్తం చేస్తున్నారు. దీంతో పురపాలిక ఆదాయానికి భారీగా గండి పడుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన వార్డు ప్లానింగ్‌ సెక్రేటరీలు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు, కొందరు వార్డు ప్రజాప్రతినిధులకు కలెక్షన్‌ ఏజెంట్లు మారినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో పేరుకే పట్టణ ప్రణాళిక విభాగం ఉందన్న విమర్శలు వినపిస్తున్నాయి. హిందూపురం పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక విభాగం పేరుకే అన్నట్లు మిగిలి పోతోంది. ఇక్కడ ఎవరూ పనిచేసేవారు లేరు. వచ్చిన వారంతా కేవలం దండుకోవడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. అధికారులు పూరి స్థాయిలో సిబ్బందిని నియమించక పోవడం, దీన్ని అవకాశంగా తీసుకొని సొంత బొక్కసాలు నింపుకోవడం సాధారణమైంది. ఈ కార్యాలయంలో అసిస్టెంట్‌ సిటీప్లానర్‌, టిపిఒ, ఇద్దరు టిపిఎస్‌లు, నలుగుదు బిల్డింగ్‌ ఇన్స్‌స్పెక్టర్లతో పాటు కింది స్ధాయి సిబ్బంది ఉండాలి. అయితే అసిస్టెంట్‌ సిటీప్లానర్‌, డిప్యూటేషన్‌ విధానంలో టిపిఒ మాత్రమే ఉన్నారు. మిగిలిన పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ప్రతి సచివాలయానికి ఒక ప్లానింగ్‌ సెక్రేటరీలు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే ప్లానింగ్‌ సెక్రేటరీలు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తే పురపాలక సంఘం వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలతో పాటు మున్సిపల్‌ రిజర్వు స్థలాలను పరిరక్షణ చేయడానికి అవకాశం ఉంది.అయితే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కొంత మంది ప్లానింగ్‌ సెక్రేటరీలు అక్రమ నిర్మాణాలు గుర్తించినప్పటికి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. కేవలం అక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించడం, వారికి నోటీసులు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. హిందూపురం పురపాలక సంఘంలో కొంత మంది సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అనుమతుల మాటున అడ్డగోలు నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. అందరికీ వాటాలు ఇస్తున్నామనే ధీమాతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొందరు అక్రమ నిర్మాణాలకు పక్కా ప్లాన్‌ వేస్తున్నారు. అడ్డదారిలో అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఒక భవన నిర్మాణానికి ప్లాన్‌ పొందాలంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.60 వేలు చలానా చెల్లించాలి. కానీ అక్రమార్కులు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొంతమందికి మామూళ్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో అనుమతులు లేకుండానే అవినీతి పునాదులపై అంతస్తులు నిర్మిస్తున్నారు. పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీనికి అధికార పార్టీకి చెందిన కొంత మంది కౌన్సిలర్లు సైతం పూర్తిగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. వాస్తవానికి భవన నిర్మాణానికి ముందే భూమి యజమాని టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన తరువాత టౌన్‌ప్లాన్‌ విభాగంలో పనిచేసే సర్వేయర్‌ స్థల పరిశీలన చేసి, కొలతలు వేయాలి. ఆ తర్వాత అది నిర్మాణానికి యోగ్యమైనదా..? కాదా..? అనేది ధ్రువీకరణ చేయాలి. టౌన్‌ ప్లాన్‌ అధికారులు దీనికి ప్లాన్‌ జారీ చేయిస్తారు. కానీ ఇక్కడ అధికారులు అవేమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత ప్లాన్‌ అప్రూవ్‌ కాకుండానే భవన నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కొందరు కనీసం అనుమతి కోసం దరఖాస్తు చేయకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. తెర వెనుక నాయకులు… హిందూపురం పురపాలక సంఘంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అక్రమ కట్టడాల వెనుక అధికార పార్టీకి చెందిన కొంత మంది కౌన్సిలర్ల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారిలో కొంత మంది పాలకులను ప్రసన్నం చేసుకుంటే మున్సిపల్‌ రిజర్వు స్థలంలో అయినా నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి. దీనికి నిదర్శనం సిండికేట్‌ ఫార్మ సోసైటికి చెందిన స్థలంలో హోల్‌సేల్‌ మార్కెట్‌ నిర్వహణకు ఇచ్చిన అనుమతులే. వీరి తీరును చూసి అధికారులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు. చెప్పినట్లు వినకపోతే వారిపై కక్ష్య సాధింపునకు పాల్పడుతు, వారిని ఎలాగైన ఎసిబి అధికారులకు పట్టిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.

➡️