పట్టు రైతులను ఆదుకోవాలి

Jan 18,2024 21:58

ధర్మవరంలో ఒంటికాలిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, రీలర్లు, నాయకులు

                            హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పట్టు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌ను వెంటనే విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని పట్టు రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టు రైతులకు ఇన్సెంటీవ్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరింది. గురువారం పట్టు గూళ్ల మార్కెట్‌ ముందు పట్టు రైతు సంఘం ఆద్వర్యంలో పట్టు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, ఓపిడిఆర్‌ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, కాంగ్రెస్‌ నాయకులు అమానుల్లాలు మాట్లాడుతు రాష్ట్రంలో మల్బరీ రైతులను జగనన్న ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టు రైతులకు, రీలర్లకు ఇవ్వాల్సి ఇన్సెంటీవ్‌ (పట్టు ప్రోత్సహకం)ను విడుదల చేయలేదన్నారు. పట్టు రైతులకు న్యాయం జరిగే వరకు తామ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, జయరామిరెడ్డి, రీలర్ల అసోసియేషన్‌ నాయకులు ముస్తఫాతో పాటు పెద్ద ఎత్తున రైతు సంఘం నాయకులు, రైతులు, రీలర్లు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : ఐదేళ్లగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం స్థానిక సిరికల్చర్‌ కార్యాలయం వద్ద పట్టు రైతులు, రీలర్లు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలవల్లి పెద్దన్న సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు. అనంతరం జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌కు సంబంధించి రూ.10కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించామన్నారు. 15 రోజుల్లో బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా మూడు రూపాయిలు కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

➡️