ఈబీసీ నేస్తం సాయం రూ.26.93 కోట్లు

మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు

             పుట్టపర్తి అర్బన్‌ : ఈబీసీ నేస్తం పథకం ద్వారా మూడవ విడత జిల్లాలో 17,953 మంది లబ్ధిదారులకు రూ.26.93 కోట్లు మంజూరు అయిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. గురువారం నాడు శ్రీ సత్యసాయి కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఈబీసీ నేస్తం సాయం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్లు లోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసి వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల సాయాన్ని అందిస్తోందన్నారు. అందులో భాగంగా మూడో ఏడాది పంపిణీ చేసిందన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఓబుళపతి, వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మీనారాయణ రెడ్డి, ఆహుడ వైస్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️