పల్లె సింధూరకు ఘన స్వాగతం

Mar 15,2024 22:05

ఎన్నికల ప్రచారంలో పల్లె కుటుంబసభ్యులు, తదితరులు

                   పుట్టపర్తి అర్బన్‌ : టిడిపి అభ్యర్థిగా పల్లె సింధూర రెడ్డిని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మొదటిసారిగా నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం కొత్తచెరువు, బుక్కపట్నం, జానకంపల్లి మీదుగా పుట్టపర్తిలోకి ఆమె ప్రచార రథం చేరుకుంది. ఆమె వెంట వెంకటకృష్ణ కిషోర్‌ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఉన్నారు. పుట్టపర్తిలో బాణాసంచా కాలుస్తూ గజమాలతో సింధూర రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 27 ఏళ్లుగా పల్లె రఘునాథ్‌ రెడ్డి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని సేవలు అందిస్తామన్నారు

కొత్తచెరువు రూరల్‌ : పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామాల్లో మహిళలు యువకులు ఆమెకు నీరాజనం పలికారు. కొత్త చెరువు మండల సరిహద్దు కొడవగానిపల్లి సమీపంలోని సత్యసాయి వాటర్‌ ట్యాంక్‌ వద్ద భారీ కాన్వారు తో వచ్చిన పల్లె సింధూర రెడ్డికి గజమాలతో స్వాగతం పలికారు. మండలంలోని కొడవగానిపల్లి సరిహద్దు నుంచి కొడవగానిపల్లి ,మైలే పల్లి, కొత్త చెరువు వరకు భారీ ర్యాలీ సాగింది. కొత్త చెరువు సర్కిల్‌ లో అంబేద్కర్‌ విగ్రహానికి వాల్మీకి విగ్రహానికి ,ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అక్కడినుండి బుక్క పట్నం, జానకం పల్లి , కర్ణాటక నాగేపల్లి మీదుగా చిత్రావతి పుట్టపర్తి గణేష్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంపై ఎంతో నమ్మకం ఉంచి తన కోడలు పల్లె సింధూరకు టికెట్‌ ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. టిడిపికి వస్తున్న ఆదరణ చూసి జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

బుక్కపట్నం : పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మండలంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లె రఘునాథ్‌ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆమెకు మండల సరిహద్దు చెరువు కట్టపై టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. జానకంపల్లి మీదుగా పుట్టపర్తి తరలి వెళ్లారు. ర్యాలీలో పల్లె వెంకటకృష్ణ కిషోర్‌ రెడ్డి, జనసేన సమన్వకర్త చంద్రశేఖర్‌, భారీ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️