‘పురం’లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఉధృతం

Jan 5,2024 21:54

అరెస్టు చేసేందుకు కార్మికులను బలవంతంగా లాగుతున్న పోలీసులు

   హిందూపురం : న్యాయమైన సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన శుక్రవారం నాడు హిందూపురంలో ఉద్రిక్తమైంది. సమ్మెను విచ్ఛిన్నం చేసే క్రమంలో భాగంగా కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ పోలీసులను అడ్డుపెట్టుకుని సచివాలయ ప్రయివేటు కార్మికులతో పనులు చేయించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు పనులను కార్మికులు అడ్డుకోవడానికి యత్నించారు. పనులు చేయడానికి వచ్చిన కార్మికులను పనులు చేయవద్దని కోరారు. అయినప్పటికీ వారు పనులు చేయడానికి సిద్ధపడ్డారు. కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగి పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. తాము న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నామని, దీనిని విచ్చిన్నం చేసే చర్యలను ప్రోత్సహించొద్దంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. అయినా వారు కనకరించలేదు. కార్మికులను రోడ్డుపై ఈడ్చిపారేశారు. కార్మిక యూనియన్‌ నాయకులు రంగనాథ్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించేయత్నం చేశారు. ఆ వాహనాన్ని మహిళా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనుక నుంచి వాహనాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి జగదీష్‌తో పాటు మరి కొంతమంది నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు ముందుకు వచ్చారు. అరెస్టును కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళలు అని చూడకుండా పోలీసులు వారిని ఈడ్చి పారేశారు. ఈ తోపులాటలో కార్మికులు అంజనమ్మ, లక్ష్మీదేవి, పద్మావతిలు స్పృహ కోల్పోయారు. కమలమ్మ చెయ్యికి రక్త గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయిన కార్మికులకు ఏమైంది అని చూసే లోగా సిఐటియు జిల్లా నాయకులు సాంబ శివ, రాము, మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి జగదీష్‌తో మరి కొంతమందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో సృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయిన మహిళల పక్కన కార్మికులు కుర్చోని పోలీసులకు, ప్రభుత్వనికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, మున్సిపల్‌ కమిషనర్‌, సచివాలయ ఉద్యోగులు వేడుక చూస్తూ ఉండిపోయారు. చివరికి కార్మికులు 108కు ఫోన్‌ చేసి సహ కోల్పోయిన మహిళలతో పాటు రక్త గాయాలైన కమలమ్మను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్టేషన్‌ ముందు ఆందోళన

అరెస్టు చేసిన యూనియన్‌ నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్య కార్మికులు వన్‌టౌన్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చివరకు పోలీసులు అరెస్టు చేసిన నాయకులను విడుదల చేశారు. దీంతో కార్మికులు చేస్తున్న ఆందోళన విరమించారు. అక్కడ నుంచి అందరూ మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు.

వేతనాలు పెంచుతాం – మున్సిపల్‌ కమిషనర్‌

    వన్‌టౌన్‌ స్టేషన్‌లో డిఎస్‌పి కంజాక్షన్‌ సమక్షంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ యూనియన్‌ నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా నాయకులు సాంబశివ, యూనియన్‌ కార్యదర్శి జగదీష్‌లు కరోనా విపత్కర సమయంలో తాత్కాలిక కార్మికులుగా తీసుకున్న 85 మంది కార్మికులకు కొనసాగిస్తూ, వారికి వేతనాలు పెంచాలని, అదే సమయంలో మరో 15 మందిని తీసుకొని వారిని ఇంటికి పంపారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి నెల వేతనాలు సక్రమంగా చెల్లించడంతో పాటు స్థానికంగా ఉన్నా సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాత్కలిక కార్మికులుగా తీసుకున్న వారికి రూ.400 నుంచి 540 వరకు పెంచుతామని, అదనంగా తీసుకోవాల్సిన 15 కార్మికులను అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోంటానని కమిషనర్‌ హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు స్టేషన్‌ ముందు చేస్తున్న ఆందోళన విరమించారు.

➡️