పెనుకొండలో తమ్ముళ్ల ఆగ్రహజ్వాల

టిడిపి కరపత్రాలను దహనం చేసి నిరసన తెలుపుతున్న బికె.పార్థసారధి మద్దతుదారులు

          పెనుకొండ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు వ్యవహారం పెనుకొండ టిడిపిలో తీవ్ర అలజడిని రేపింది. సీనియర్‌ నాయకుడు, టిడిపి హిందూపురం జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధికి టికెట్టు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. శనివారం నాడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన జాబితాలో బికె పేరు లేకపోవడాన్ని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు పెనుకొండలోని టిడిపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన టిడిపి ఫ్లెక్సీలు, జెండాలను చించివేశారు. కరపత్రాలను రోడ్డుపై వేసి దహనం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ టిడిపి కష్టకాలంలో ఉన్న సమయంలో బికె.పార్థసారథి పార్టీ కోసం కృషి చేశారని చెప్పారు. వివాదరహితుడిగా మంచి పేరు ఉన్న ఆయన్ను కాదని ఇతరులకు టికెట్టు ఇవ్వడం సరికాదన్నారు. అధిష్టానం పార్థసారథిని పిలిపించి టికెట్‌ విషయంలో చర్చించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి ఎమ్మెల్యే అభ్యర్థిగా బికెకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️