పోలీసు స్టేషన్‌లో ‘బంగారం’ వాహనం..!

బంగారు ఆభరణాలతో పట్టుబడిన వాహనం

          చిలమత్తూరు : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద బంగారు నగలను తీసుకెళ్తున్న ఓ వాహనాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఓ ప్రముఖ బంగారు షాపునకు చెందిన రూ.15 కోట్ల విలువజేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాన్ని పట్టుకున్న అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిలమత్తూరు పోలీసు స్టేషన్‌లో ఉంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం ఉదయం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఎన్నికల సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా బెంగుళూరు నుంచి అనంతపురం వైపునకు వెళ్తున్న జీపును తనిఖీ చేయగా అందులో ఓ ప్రముఖ బంగారు నగల షోరూంకు సంబంధించిన బంగారు నగలు, వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పత్రాల పరిశీలన నిమిత్తం జీపును చిలమత్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీటి పరిశీలన నిమిత్తం పోలీసులు జిల్లా ఉన్నతాధికారుల, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు సమాచారం తెలియజేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, తహశీల్దార్‌ భాగ్యలత, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి మధుసుధన్‌ రెడ్డిలు పత్రాలను పరిశీలించారు. అయితే వాహనంలో ఉన్న నగలను మాత్రం చూడలేదు. సోమవారం రాత్రి వరకు వాహనాన్ని చిలమత్తూరు పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. పూర్తి స్థాయిలో పత్రాలను పరిశీలించిన అనంతరమే వాహనాన్ని వదిలివేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. బంగారు నగలు ఉన్న వాహనానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు.

➡️