బెదిరింపులకు భయపడం

Jan 6,2024 22:07

జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు, నాయకులు

                      పుట్టపర్తి రూరల్‌ : తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడే ప్రసక్తి లేదని అంగన్వాడీలు హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 26వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీవో ప్రతులను ఆర్డీవో కార్యాలయం ముందు దగ్ధం చేశారు. అంతకు ముందు నాయకులు మాట్లాడుతూ 26 రోజుల నుండి వివిధ దశలలో అంగన్వాడీలు నిరసనలు తెలియజేసినా ప్రభుత్వ పెద్దలలో ఎలాంటి చలనం రాలేదన్నారు. సమ్మెను ఉధృతం చేయడంలో భాగంగా 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ మాట్లాడుతూ అంగనవాడీ హెల్పర్స్‌ వర్కర్స్‌ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ దశల్లో నిరసనలు చేపట్టిన ప్రభుత్వం కనికరించలేదన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నామన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల ధరలు పెరగడమే కాక అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారంలో సైతం కోతలు పడుతున్నాయన్నారు. అంగన్వాడీల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీదేవి, జిల్లా కోశాధికారి ఎస్‌ దేవి, ఓడిసి ప్రాజెక్టు కార్యదర్శి రంగమ్మ, అధ్యక్షురాలు అశ్వర్థమ్మ, ధర్మవరం ప్రాజెక్ట్‌ కార్యదర్శి చంద్రకళ, సికేపల్లి ప్రాజెక్టు అధ్యక్షురాలు రమణమ్మ, గుడిబండ అధ్యక్షురాలు నాగమణి, పుట్టపర్తి అధ్యక్షురాలు శ్రావణి , బ్యాళ్ల అంజి తదితరులు పాల్గొన్నారు.ఎస్మా ప్రయోగం దుర్మార్గం : అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ జీవో 2 ను జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరికి నిదర్శనంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంగన్వాడీల 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన వారి దీక్షలకు మద్దతు పలికారు. ఈసందర్భంగా అంగన్వాడీలతో కలసి ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం ఇంతియాజ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమన్నారు. వెంటనే జీవో 2 ను ఉప సంహరించాలని డిమాండ్‌ చేశారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. ప్రభుత్వ వైఖరిని ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️