మూడవ దశ రీ సర్వే వేగవంతం : కలెక్టర్‌

Feb 16,2024 22:10

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

                       పుట్టపర్తి అర్బన్‌ : భూ రక్ష రీ సర్వే పనులను వేగవంతంగా చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలో మాట్లాడుతూ రెవిన్యూ రీ సర్వే మూడవ దశ ఇనాం భూములు, అసైన్మెంట్‌ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద కరువు మండలాలలో కూలీలకు అడిగిన వెంటనే పని కల్పించాలని ఆయన ఆదేశించారు. రాబోయే వేసవికాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఎపిఐఐసి ప్రాజెక్టుల భూ సమస్యలు తదితర అంశాలపై కూడా కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీసర్వే మూడవ దశ నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు, పక్కాగృహాలు రిజిస్ట్రేషన్‌ చేయించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయే వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి విజయకుమార్‌, డిఎంహెచ్‌ఒ ఎస్‌వి కృష్ణారెడ్డి, సిపిఒ విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️