రైతులపై కేంద్రం దమనకాండ

 నిరసన తెలుపుతున్న వ్యకాసం, సిపిఎం నాయకులు

         పెనుకొండ : రైతులపై కేంద్ర ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తూ వారిని చంపేస్తోదంటూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ఉద్యమంలో యువరైతు శుభకరణ్‌ సింగ్‌ను పోలీసులు కాల్చిచంపడం కేంద్రం హత్యగా అభివర్ణిస్తూ, ఇందుకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ శుక్రవారం నాడు పట్టణంలోని మడకశిర రోడ్డులో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా అడుగడుగునా అడ్డుకుంటోందన్నారు. హర్యానాలో రైతులపై టియర్‌ గ్యాస్‌, ఫిరంగులతో దాడి చేశారన్నారు. రబ్బర్‌ బుల్లెట్‌ తలకు తగిలి యువరైతు శుభకరణ్‌ సింగ్‌ మరణించడం అత్యంత విచారకరం అన్నారు. ఈ రైతు మరణానికి కేంద్రప్రభుత్వమే కారణం అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, నాయకులు ఈఎస్‌.వెంకటేష్‌, ప్రవీణ్‌, సాంబ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, తిప్పన్నతోపాటు రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

➡️