లారీ బొలేరో ఢ – ముగ్గురు మృతి

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బొలేరో వాహనం

      అగళి : ఎంతో సంతోషంగా పెళ్లివేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వివాహ రిసెప్షన్‌ ముగించుకుని వస్తున్న వారి వాహాన్ని లారీ ఢకొీనడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారంతా ఒకే గ్రామం, బంధువులు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం పలుకుటుంబాల్లో చీకట్లను నింపింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… రొళ్ల మండలం దాసప్పపాళ్యంకు చెందిన ముద్దరంగప్ప కూతురు వివాహానికి సంబంధించి రిసెప్షన్‌ వేడుక కర్నాటక రాష్ట్రం శిర వద్ద ఉన్న హుజ్జహీరనహల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు రొళ్ల మండలం దాసప్పపాళ్యంకు చెందిన మద్దరంగప్ప బంధువుల కుటుంబ సభ్యులు 14 మంది కెఎ642588 నెంబర్‌ గల బొలేరో వాహనంలో వెళ్లారు. అక్కడ రిసెప్షన్‌ వేడుకను ముగించుకుని స్వగ్రామానికి అదే వాహనంలో బయళ్దేరారు. రాత్రి 11-45 గంటలకు బొలేరో శిరా నుంచి రొళ్ల వైపునకు వస్తుండగా హిందూపురం నుంచి శిరా వైపు వెళ్తున్న సిమెంట్‌ లారీ వేగంగా వచ్చి ఢకొీంది. దీంతో బొలేరో రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ఉన్న దాసప్పపాళ్యం గ్రామానికి చెందిన కాంతప్ప(40), అమ్మజక్క(35), తిమ్మప్ప(43)లు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భీతావహక వాతావరణం నెలకొంది. గాయపడిన వారు ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిఐ మనోహర్‌, ఎస్‌ఐ వీరేష్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హిందూపురం, తుముకూరు, మడకశిర ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన, గాయపడిన వారంతా ఒకే గ్రామం, బంధువులు కావడంతో దాసప్ప పాళ్యం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

➡️