విదేశీ విద్య దీవెన విద్యార్థులకు ఒక వరం

మెగాచెక్కును విద్యార్థుల తల్లిదండ్రులకు అందిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

        పుట్టపర్తి అర్బన్‌ : జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ప్రతిభ గల విద్యార్థులకు ఒక వరం లాంటిదని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విదేశీ విద్యదీవెన పథకాన్ని బటన్‌ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు అగ్రి బోర్డ్‌ ఛైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ తుంగ ఓబుళపతి, ఎంపిపి రమణారెడ్డి, పుడా ఛైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి, ఎస్సీ సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్‌, గిరిజన సంక్షేమ అధికారి మోహన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న విదేశీ విద్య దీవెన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.44,09,205 నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యిందన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పథకం ద్వారా ఎంపికైన ముగ్గురికి ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు మెగా చెక్కును అందించారు.

➡️