వేలం వేయకుండానే స్థలాల కేటాయింపు

వేలం వేయకుండానే స్థలాల కేటాయింపు

హిందూపురం టోకు మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతున్న దృశ్యం

 

              హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ అధికారులు అధికార పార్టీనేతలకు జీ హుజూర్‌ అంటూ పురపాలక సంఘ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఫలితంగా మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం పరగి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయాల టోకు మార్కెట్‌.

హిందూపురం పురపాలక సంఘంలో నూతనంగా నిర్మాణం చేసిన వాణిజ్య సముదాయ భవనం, కూరగాయాల మార్కెట్‌లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పరగి బస్టాండ్‌ ఆవరణంలో ఎటువంటి అనుమతులు లేకున్నా టోకు వ్యాపారులకు స్థలాన్ని కేటాయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నూతన మార్కెట్‌ నిర్మాణ సమయంలోనే టోకు వ్యాపారులకు స్థలాన్ని కేటాయించాల్సుంది. అయితే ఆ సమయంలో మున్సిపల్‌ అధికారులు ఆలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టోకు వ్యాపారులు పట్టణంలోని పశుసంవర్దక శాఖ ఆధీనంలో ఉన్న రైతు బజారులో టోకు వ్యాపారం నిర్వహించుకునే వారు. అయితే వ్యాపారులు అందరు తమకు స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్‌ అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులను కోరారు. దీంతో మే నెలలో అప్పటి ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ సూచనల మేరకు పట్టణంలోని టిఎస్‌ నెంబరు 68 పరిగి బస్టాండ్‌లో స్థలాన్ని 18 మందికి కేటాయిస్తు 2023 మే 31న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానం నెంబరు 970 అనుసరించి కేటాయిస్తున్న స్థలాన్ని మూడు సంవత్సరాల కాల పరమితితో బహిరంగ వేలం పద్దతిలో టోకు వ్యాపారులకు కేటాయించాలని ఆసమయంలో కౌన్సిల్‌ తీర్మానం చేశారు. అయితే అప్పుడు కౌన్సిల్‌ చేసిన తీర్మానానికి తిలోదకాలు ఇచ్చి టోకు వ్యాపారులు వారికి ఇష్టం వచ్చినట్లు స్థలాన్ని కేటాయించుకుని షెడ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అయినప్పటికి మున్సిపల్‌ అధికారులు మాత్రం తమకు ఏమీ తెలయదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పురపాలక సంఘంలో అనుమతులు లేకుండా చిన్న గది నిర్మాణం చేసుకున్నా నోటీసులు ఇచ్చే మున్సిపల్‌ యంత్రాగం కోట్ల రూపాయలు విలువ చేసే పురపాలక స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలను చేసుకుని దర్జాగా వ్యాపారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవటం మాట అటుంచి కనీసం నోటీసులు సైతం ఇవ్వకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం టోకు మార్కెట్‌ షెడ్లు నిర్మాణం అనంతరం మార్కెట్‌ను ఇన్‌చార్జ్‌ దీపిక భర్త వేణురెడ్డి ప్రారంభించడంతెఓ మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్‌ అధికారులు పక్కగా నిబంధనలు పాటించి, కౌన్సిల్‌ ఆమోదం మేరకు స్థలాన్ని బహిరంగ వేలం పద్దతిలో కేటాయింపులు జరిపి ఉంటే పురపాలక సంఘానికి లక్షల రూపాయల్లో ఆదాయం వచ్చేది. నిబందనలు విస్మరించడంతో పురపాలక సంఘం ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికైన దీనిపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి పురపాలక సంఘం ఆస్తులను పరిరక్షించడంతో పాటు బహిరంగ వేలం పద్దతిలో స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుతున్నారు.

➡️