వైసిపిది కోతల పాలన : నారా లోకేష్‌

కొత్తచెరువు సభలో ప్రసంగిస్తున్న నారా లోకేష్‌

           కొత్తచెరువు : ‘2019లో రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాగానే అప్పటి వరకు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కట్‌ చేసింది. దాదాపు వంద సంక్షేమ పథకాలను రద్దు చేసింది. పేదలకు అందే సాయాన్ని దూరం చేసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గత ఐదేళ్లుగా కటింగ్‌ పాలనను సాగిస్తున్నారు.’ అంటూ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంఖారావం యాత్రలో భాగంగా శుక్రవారం నాడు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ముందుగా పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం కొత్తచెరువు, కదిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారన్నారు. పెళ్లికానుకలు, పండుగ కానుకలు, స్కూల్‌ ఫీజురీయింబర్స్‌ మెంట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ తదితర వాటిని జగన్మోహన్‌రెడ్డి కట్‌ చేశారన్నారు. ఇలా 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో కరెంట్‌ ఛార్జీలు 9 సార్లు పెరిగాయన్నారు. ఇంటి పన్ను, చెత్తపన్నులను పెంచేశారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ ధరలను పెంచి సామాన్యులను బాదేశారని తెలిపారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడం లేదన్నారు. హెచ్‌ఎల్సీ ఆధునీకరణ జరగలేదన్నారు. టీడీపీ హయాంలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే నేడు నిలిపివేశారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాను అభివద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. 1.30వేల మంది రైతులకు 90శాతం సబ్సీడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ అందించామన్నారు. హార్టికల్చర్‌ హబ్‌గా అనంతను అభివద్ధి చేశామని తెలియజేశారు. అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. కరవు వస్తే ఒకే ఏడాది రూ.2వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సీడీ అందించి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులను టిడిపి హయాంలో చేపట్టామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకాగానే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3వేలు నిరుద్యోగ భతి కల్పిస్తామని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామన్నారు. అనంతలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని పునరుద్ఘాటించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు బాబు సూపర్‌-6, బిసి డిక్లరేషన్‌ తదితర హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె.పార్థసారధి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, పవన్‌కుమార్‌రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు టిసి.వరుణ్‌, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పత్తి చంద్రశేఖర్‌, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌.శ్రీనివాసులు, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు మల్లెల జయరాం, చంద్రమోహన్‌, రిటైర్డ్‌ టీచర్‌ నాగేంద్రప్రసాద్‌, కెఎల్‌వి.ప్రసాద్‌, డీఎస్పీ వేణుగోపాల్‌, వెంకటనారాయణ, మండల కన్వీనర్‌ రామకృష్ణ, టౌన్‌ కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులుతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️