సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె కొనసాగింపు

Jan 4,2024 21:38

ధర్మవరంలో వినూత్న నిరసన

               ధర్మవరం టౌన్‌ : వెంకటేశ్వరా నీవైనా మాసమస్యలు పరిష్కరిం చేలా వైసిపి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా గురువారం సమ్మె శిబిరం వద్ద గోవింద నామస్మరణ చేస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ సమ్మెకు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు పట్టణ నాయకులు బాలాజీ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న మాటాడ్లుతూ 24 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా ఆ సమ్మెను విచ్ఛన్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. శుక్రవారం లోగా సమ్మె విరమించి విధులల్లోకి వెళ్లకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులు పంపడం ఏమిటని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకపోతే ఏ చర్యకైన సిద్ధమన్నారు. ఇంకా అంగన్వాడీల ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చుతుందన్నారు. ఈకార్యక్రమంలో అంగనవాడీలు పోతక్క, దీనా, మాంచాలనిదేవి, అనిత, కృష్ణవేణి, భువనేశ్వరి, లలిత, తదితరులు పాల్గొన్నారు. కదిరి అర్బన్‌ : 24 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవటం అన్యాయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్‌ ముట్టడిలో పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ గురువారం ఆర్‌ అండ్‌ బి బంగ్లా నుండి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బిరెడ్డి, సిఐటియు నాయకులు జిఎల్‌ నరసింహులు, జగన్మోహన్‌, ముస్తక్‌, నాగరాజు, నాయకులు బాబ్జాన్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మాబున్నీసా, చంద్రకళ, శారద, మాధవి, సుజాత, లక్ష్మీదేవి, వకుల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌ : పుట్టపర్తి ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడీల సమ్మె 24వ రోజు గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. సిఐటియు నాయకులు బ్యాల్ల అంజి మాట్లాడుతూ ప్రభుత్వానికి అంగన్వాడీల ఘోష వినపడలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదాకా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. పరిగి : అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని సెక్టార్‌ నాయకురాలు పద్మ వెల్లడించారు. అంగన్వాడీ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి తాము పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లింగారెడ్డి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని దండాలు పెడుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు రజియా, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ సందర్శించి అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, బావమ్మ, సెక్టార్‌ లీడర్లు మాబున్నీసా, వరలక్ష్మి, అనిత, శ్యామలగౌరీ, తదితరులు పాల్గొన్నారు. సోమందేపల్లి : సోమందేపల్లిలో అంగన్వాడీలు సమ్మెను యథావిధిగా కొనసాగించారు. న్యాయ మైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమం లో యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, సభ్యులు అనురాధ, చంద్రకళ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అమరాపురం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ శిబిరం వద్దనే వంటా వార్పు కార్యక్రమం చేపట్టి రోడ్డుపైనే భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో సిఐటియు నాయకుడు మహబూబ్‌ఖాన్‌, యూనియన్‌ లీడర్లు నాగవేణి, అనసూయమ్మ, మంజుల, చంద్రకళ, నాగరత్నమ్మ, సారక్క పాల్గొన్నారు.

➡️