సార్వత్రిక సమరానికి 11 వేల మంది సిబ్బంది : కలెక్టర్‌

మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్‌ అరుణ్‌బాబు తదితరులు

          పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో జరగబోయే సార్వత్రిక సమరానికి 11 వేల మంది సిబ్బంది నియమించి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవరెడ్డి తెలియజేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో స్వీప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చాలామంది తమ ఓట్లు పోయాయని తాము కొత్తగా ఓటు దరఖాస్తు చేసుకున్నాం వస్తాయా.. రావా..? ఎవరికి ఓటు వేసినా ఈవీఎం లోపాలతో వేరొకరికి ఓటు పడుతుందన్న అపోహలు వీడాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు కలెక్టరేట్లోని మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శించవచ్చన్నారు. ప్రజలు వారికి వీలైన సమయంలో వస్తే వారికి ఈవీఎంల మీద ఉన్న అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి అవగాహనతో పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 1561 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహనఖు సుమారు 11 వేల మంది సిబ్బంది అవసరమని గుర్తించామన్నారు. ఆయా నియోజకవర్గంలో ప్రధాన కేంద్రాల్లో రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. గోరంట్లలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాలను మౌంటశ్వరి హై స్కూల్‌ నందు స్థల సేకరణ గుర్తించామన్నారు. ఇందులో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. లేపాక్షిలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో మరొక కౌంటింగ్‌ కేంద్రానికి స్థలాన్ని పరిశీలన చేశామన్నారు. అక్కడ పెనుగొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. ధర్మవరం మార్కెట్‌ యార్డ్‌లో ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రంలో పిఓ, ఏపీవో, ముగ్గురు ఓపివోలు ఉంటారని తెలిపారు. 20 శాతం పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, స్వీప్‌ అధికారి శివరంగ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️