స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యం

Mar 7,2024 22:20

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

                       హిందూపురం : యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో భాగంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు కెవిఐసి రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ గ్రేప్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటిరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతు యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి అందులో నైపుణ్యం కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంకుల్లో రుణ సహాయం అందించి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే హిందూపురం ప్రాంతంలో ఇప్పటికే 430 మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. వీరికి తమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా రంగాలకు సంబంధించిన టూల్‌ కిట్లను అందజేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కుమార్‌తో పాటు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అదేవిధంగా ఇప్పటికే శిక్షణ పొంది ఆయా రంగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు పట్టణంలోని రైల్వే కమ్యూనిటీ హాలు లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ఈ ఎగ్జిబిషన్‌ ను చైర్మన్‌ తదితర ఉన్నతాధికారులు ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందన్నారు. పట్టణ ప్రజలు ,మహిళలు ఆయా ఎగ్జిబిషన్‌ తిలకించి అందులో ఉత్పత్తులను పరిశీలించవచ్చని తెలిపారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో భాగంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా హిందూపురంలో ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ తో పాటు తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్‌, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 600యూనిట్లు ఈ ఎగ్జిబిషన్‌ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు దేవేంద్ర కుమార్‌ గౌతమ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️