హత్యకేసు నిందితులపై చర్యలు తీసుకోండి

Dec 4,2023 21:37

సమస్యను వివరిస్తున్న బాధితులు, గ్రామస్తులు

         పుట్టపర్తి రూరల్‌ : తన మేనల్లుడు నాగరాజు హత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ బాధితురాలు మంగమ్మ సోమవారం జిల్లా ఎస్పీ మాధవ రెడ్డికి వినతి పత్రం అందజేసింది.గ్రామంలోని యువతిని ప్రేమించిన కారణంగా ఒక పథకం ప్రకారం హత్య చేసి, మద్యం తాగి మృతి చెందినట్లుగా నమ్మించారని బాధితురాలు మంగమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు హిందూపురం మండల పరిధిలోని కొటిపి గ్రామానికి చెందిన బాధితురాలు మంగమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి వివరించింది. తన అన్న కుమారుడు నాగరాజును చిన్నతనం నుంచి తానే పెంచి పెద్ద చేశానని చెప్పారు. 25 సంవత్సరాలు వయసు గల నాగరాజు గ్రామంలో విద్యుత్తు పని, అదే విధంగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ గా పనిచేసేవాడని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడన్నారు. ఈ విషయం విషయం తన దృష్టికి రావటంతో మందలించినట్లు వివరించారు. అప్పటినుంచి నాగరాజు బుద్ధిగా తన పని తాను చేసుకుంటూ వచ్చాడన్నారు. అయితే ఆ యువతి మేనమామ, ఆయన కుమారులు కలసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేసి మద్యం తాగినట్లు చేసి ఇంటి వరండాలో పడుకోబెట్టి వెళ్లారని ఆరోపించారు. నాగరాజు అంత్యక్రియలు అయిన నాలుగైదు రోజుల తరువాత తమకు అనుమానం వచ్చిందని దీంతో పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశామన్నారు. చివరకు అధికారులు స్పందించి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారని అయితే ఇంతవరకు పోస్టుమార్టు రిపోర్టు ఇవ్వలేదని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ కేసు విషయంలో నిజాయితీ గల పోలీసు అధికారిని నియమించి దర్యాప్తు చేసి, పూర్వపరాలను వెలికి తీయాలని బాధితురాలు ఎస్పీని కోరింది.

➡️