1500 ఓటర్ల దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రాలు : కలెక్టర్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1500 ఓటర్లకు మించి ఉంటే ఆ పోలింగ్‌ కేంద్రానికి అనుబంధంగా మరొక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, డిఆర్‌ఒ కొండయ్య, నియోజకవర్గ ఎన్నికల అధికారులు పుట్టపర్తి భాగ్యరేఖ, కదిరి వంశీకష్ణ, మడకశిర గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల సహకారంతో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సలహాలు సూచనలు అందజేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల సంఖ్యను అనుసరించి జిల్లాలో 1561 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఎక్కడైనా ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో అనుబంధ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఎన్నికల విధుల నిర్వహణకు ఎలాంటి కొరత లేకుండా సిబ్బందిని నియమించామన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు మార్పులు చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒకే కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్‌ స్టేషన్లో ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు త్వరలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వర్క్‌ షాప్‌ నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల మార్పుపై 10 అభ్యంతరాలు వచ్చాయని పేరు మార్పుపై 94 ప్రతిపాదనలు వచ్చాయని వాటిని సంబంధిత ఎన్నికల అధికారులకు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఎం పైపల్లి గంగాధర్‌, బీఎస్పీ గోవిందు, సుబ్బరాయుడు, ఆమ్‌ఆద్మీ దండు నాగరాజు, కాంగ్రెస్‌ ప్రతినిధి పొట్ల గంగాద్రి, టిడిపి ప్రతినిధులు సామకోటి ఆదినారాయణ, మనోహర్‌, సిపిఐ ఆంజనేయులు, జనసేన అబ్దుల్‌, బిజెపి అమర్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️