టిడిపిలో అసమ్మతి చల్లారిందా..?

       అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్టు ఖరారుపై టిడిపిలో అసమ్మతి చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు సర్దుబాటు చేసినా కొన్నింటిలోనూ కొనసాగుతూ వచ్చాయి. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదది, జితేందర్‌ గౌడ్‌లు అసంతృప్తితోనున్నారు. టిక్కెట్టు ఖరారవలేదన్న విషయం తెలిసిన వెంటనే రెండు నియోజకవర్గాలల్లో టిడిపి కార్యాలయాలపై దాడి చేసి ఫర్నీచర్లు ధ్వంసం చేశారు. అనంతరం కూడా నిరసనల పర్వం కొనసాగుతూ వచ్చింది. ఒకనొక దశలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారేమనన్నంతగా ప్రచారం నడిచింది. అయితే పార్టీని వీడబోమన్న విషయాన్ని మాత్రం ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌లను పిలిచి మాట్లాడారు. దీంతో వారు కొంత మెత్తబడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే వారికి ఎటువంటి హామీ లభించిందన్నది చర్చ నడుస్తోంది. పార్టీ బాధ్యతలు ఈ నేతలకు అప్పగించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ప్రభాకర్‌ చౌదరికి రాయలసీమ బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం నడుస్తోంది. జితేందర్‌ గౌడ్‌కు జిల్లా బాధ్యతలు అప్పగించే సూచనలున్నట్టు తెలుస్తోంది. ఈ హామీతోపాటు ఇంకేమైనా ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్‌ నాయకులే కావడంతో వారి నియోజవర్గాల్లో మంచి పట్టున్న నేతలు కూడా. వీరు అభ్యర్థులతో కలిసి పనిచేస్తే పార్టీని సానుకూల పరిస్థితులే ఉండనున్నాయి. ఇదే రకమైన అసంతృప్తి ఉన్న శింగనమల నియోజకవర్గం నేతలతో ఇది వరకే చంద్రబాబు మాట్లాడారు. దీంతో శింగనమలలో వ్యతిరేకంగానున్న ఆలం నరసానాయుడు, కేశవరెడ్డిలు ఇప్పుడు మౌనంగా పనిచేసుకునిపోతున్నారు. దీంతో అసమ్మతి కనిపించడం లేదు. ఇక మడకశిరలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభ్యర్థి సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి మధ్య పడటం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఇవి మినహా తక్కిన అన్ని చోట్లా కొంత వరకు పరిస్థితి మారినట్టుగానే కనిపిస్తున్నాయి. అసంతృప్తి తీవ్రంగా ఉన్న కళ్యాణదుర్గం, కదిరిల్లో ఇప్పటికే అసమ్మతి నేతలు పార్టీని వీడిపోయారు. వారు బయటకు పోవడంతో తక్కిన వారు పార్టీ కోసం పనిచేసే వారు ఉండిపోయారు. అనంతపురం, గుంతకల్లు అదినేత హామీతో సద్దుమణిగినట్టయింది. తక్కిన నియోజకవర్గాల్లో ఎక్కడా పెద్దగా అసంతృప్తులు ఇక కనిపించడం లేదు. ఇక సరిచేయాల్సింది మడకశిర నియోజకవర్గం ఒక్కటే పెండింగులో ఉంది.

➡️