ఎన్నికల సమయంలోనూ ఆగని అక్రమ అరెస్టులు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాద్యాక్షులు బాబావలికి అరెస్టు నోటీసు ఇస్తున్న పోలీసులు

      హిందూపురం : జిల్లాలో ఎక్కడ ముఖ్యమంత్రి పర్యటించినా వామపక్ష నాయకులతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తారు. ఈ అక్రమ అరెస్టులు ఎన్నికల సమయంలో సైతం ఆగడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం జగన్‌ శనివారం హిందూపురం వచ్చారు. ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటారో అనే కారణంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిపిఐ నాయకులు వినోద్‌ కుమార్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో పాటు వారు సభా స్థలి వద్దకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చి పంపారు. వారు మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. హిందూపురంలో మోడల్‌ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉర్దూ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని ఐదేళ్ల క్రితం సిఎం జగన్‌ హామీ ఇచ్చి నెరవేర్చకుండా కాలయాపన చేశారన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారన్నారు. వీటిపై ప్రశ్నిస్తురనే కారణంతో ఉద్యమాలను అణచి వేయాలని అక్రమ అరెస్టు చేయడం సరికాదన్నారు. చేతనైతే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️