వైసిపికి ఇక్బాల్‌ గుడ్‌బై..!

వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ (ఫైల్‌ ఫొటో)

           అనంతపురం ప్రతినిధి : శాసనమండలి సభ్యులు, హిందూపురం నియోజకవర్గం వైసిపి మాజీ సమన్వయకర్త మహమ్మద్‌ ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికి, వైసిపికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పంపారు. ఈ లేఖ ఇప్పుడు సోషియల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్బాల్‌ పోలీసు ఆఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. 2019కి ముందు ఆయన వైసిపిలో చేరి హిందూపురం నుంచి పోటీ చేశారు. బాలకృష్ణపై పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తరువాత హిందూపురం వైసిపి సమన్వయర్తగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ఈ రెండింటికీ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన భవిష్యత్‌ కార్యచరణ ఏ విధంగా ఉండనుందన్న దానిపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. పోలీసు శాఖలో ఐజిగా పనిచేసిన మహమ్మద్‌ ఇక్బాల్‌ ఉద్యోగ విరమణ తరువాత వైసిపిలో చేరారు. వెంటనే ఆయనకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం టిక్కెట్‌ను వైసిపి కేటాయించింది. బాలకృష్ణపై పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. అనంతరం ఎమ్మెల్సీ పదవిని ఆయనకు వైసిపి కట్టబెట్టింది. ఎమ్మెల్సీ ఉంటూనే హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్తగా ఉంటూ వచ్చారు. ఆయనకు ముందు నుంచి హిందూపురంలో ఉన్న వైసిపి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లలేక పోయారు. నవీన్‌నిశ్చల్‌, రామకృష్ణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అబ్దుల్‌ ఘని తదితర గ్రూపులు హిందూపురం వైసిపిలో ఉన్నాయి. వీరి మధ్య అనేక సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకున్నాయి. గ్రూపు తగాదాల నడుమే వైసిపి నేత రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు. దానికి ప్రోత్సహం ఇక్బాలే అంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ప్రోద్బలంతోనే రామకృష్ణారెడ్డి హత్య జరిగినట్టు కుటుంబ సభ్యులు సైతం ఆరోపించారు. ఈ ఆరోపణల నడుమ ఇక్బాల్‌ను హిందూపురం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్టానం తప్పించింది. ఇక్బాల్‌ ఉన్నంత కాలం స్థానికులకే టిక్కెట్టు కేటాయించాలని వైసిపి హిందూపురం అసమ్మతి నేతలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇక్బాల్‌ అనంతరం కూడా వైసిపి బయటి ప్రాంతానికి చెందిన దీపికను బిసి కోటాలో హిందూపురం సమన్వయకర్తగా నియమించింది. హిందూపురం నుంచి మార్చిన తర్వాత మరో నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తారని ఇక్బాల్‌ ఆశించారు. సొంత జిల్లా అయిన కర్నూలులోనైనా అవకాశం ఉంటుందని భావించారు. కాని ఎక్కడా ఆయనకు వైసిపి అవకాశం కల్పించలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం పిలుపుల్లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో ఇక్బాల్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రాధాన్యతలేని చోట కొనసాగడం ఎందుకన్న ఉద్ధేశంతో వైసిపికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ ప్రకటన చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది.

భవిష్యత్‌ కార్యచరణ ఏమిటో ?

        పోలీసు అధికారిగా ఉన్న ఇక్బాల్‌ రాజకీయ నాయకుడిగా మారార. ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేసిన వైసిపిని వీడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భవిష్యత్‌ ఏ రకంగా ఉండనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. భవిష్యత్తు కార్యచరణ ఏమిటన్నదానిపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించే వరకు మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు ఉన్నఫలంగా రాజీనామా చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన మరేదైనా పార్టీలో చేరాతారా.? లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా.? అన్న చర్చనడుస్తోంది. ఒకానొక సందర్భంలో టిడిపి నుంచి ఆయనకు అనంతపురం టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. టిడిపి అధిష్టానం అనూహ్యంగా అనంతపురం టిక్కెట్టును దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు కేటాయించింది. రెండు పార్టీల వైపు నుంచి దాదాపుగా టిక్కెట్ల ఖరారు పూర్తయిన నేపథ్యంలో ఆయన వైసిపికి రాజీనామా చేశారు. భవిష్యత్తు నిర్ణయం ఏమిటన్న దానిపై త్వరలో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

➡️