Apr 17,2024 22:10

నేటి నుంచి నామినేషన్లు షురూ..!

      అనంతపురం ప్రతినిధి : ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా గురువారం విడుదల కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. పార్లమెంట్‌ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఆయా జిల్లా కేంద్రాల్లో ఉండగా, అసెంబ్లీకి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఉండనుంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు నామినేషన్ల దాఖలుకు సమయత్తం అవుతున్నాయి. నేడు గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఏప్రిల్‌ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అనంతరం ఏప్రిల్‌ 29వ తేదీతో ఉపసంహరణల గడువు ముగియనుంది. మే 13న ఎన్నికలు, జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

       నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లను అదికార యంత్రాంగం పూర్తి చేసింది. అనంతపురం పార్లమెంటుకు సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. సత్యసాయి జిల్లాలో సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పుట్టపర్తిలో హిందూపురం పార్లమెంటుకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాయదుర్గంకు కరుణకుమారి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణిగా వ్యవహరించనున్నారు. ఉరవకొండకు జాయింట్‌ కలెక్టరు కేతన్‌ గార్గ్‌, గుంతకల్లుకు శ్రీనివాసులరెడ్డి, తాడిపత్రికి రాంభూపాల్‌రెడ్డి, శింగనమలకు వెన్నెల శ్రీను, అనంతపురానికి ఆర్డీవో గ్రంథి వెంకటేశ్‌, కళ్యాణదుర్గంకు ఆర్టీవో సుస్మిత రాణి, రాప్తాడుకు వసంతబాబు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి భాగ్యరేఖ, కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వంశీకృష్ణారెడ్డి, పెనుకొండ నియోజకవర్గానికి సబ్‌ కలెక్టరు అపూర్వ భరత్‌, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వెంకట సాయిరామిరెడ్డి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి గౌరిశంకర్‌ లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. ఆయా కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను వీరు స్వీకరించనున్నారు.

ఊపందుకోనున్న ఎన్నికల హడవుడి

         తొలి ఘట్టానికి సమయం ఆసన్నమవడంతో ఎన్నికల సందడి మరింత ఊపందుకోనుంది. ఎన్నికల షెడ్యుల్‌ వెలువడి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు అవసరమైన ఏర్పాట్లు ఇది వరకే చేసుకుని ఉన్నారు. తొలి రోజు నుంచే ఎన్నికల హడావుడి ఊపందుకోనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటన్నింటిలోనూ నేటి నుంచి నామినేషన్లు స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు

          నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని ఆర్‌ఒ కేంద్రాల వద్ద పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ఆదేశానుసారం బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఆర్‌ఒ కార్యాలయాల నుంచి 100 మీటర్ల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో స్థానిక పోలీసుతో పాటు కేంద్ర సాయుధ బలగాలతో పహారా కొనసాగుతూ ఉంటుంది. ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనా చోటు చేసుకోకుండా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ఆయా జిల్లాల ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆధ్వర్యంలో ముందస్తు బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

అన్ని పత్రాలూ సరిగా ఉండాలి..!

       అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటనే అధికారులు స్వీకరిస్తారు. అభ్యర్థులు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఒక్క సెకండ్‌ దాటినా ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు నామినేషన్లు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక నామినేషన్ల దాఖలు సమయంలో గరిష్టంగా 3 వాహనాలకు అనుమతి ఉంటుంది. 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్‌ఒ కార్యాలయంలోకి వెళ్లొచ్చు. అభ్యర్థి సువిధ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లను దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

ముహూర్తాలు చూసుకుని..

          నామినేషన్ల వేసే సమయం రావడంతో అభ్యర్థులు అ పనుల్లో బిజీ అయ్యారు. ముఖ్యంగా అభ్యర్థులు మంచి సమయం, మహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు పండితుల వద్దకు వెళ్లి వారి పేరు బలాలతో ఏ రోజు నామినేషన్‌ వేస్తే మంచి జరుగుతుందో అని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్‌ ఎప్పుడు వేయాలన్న తేదీలను నిర్ణయించుకున్నారు. అన్ని నియోజకవర్గాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా నామినేషన్‌ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. డమ్మీ పత్రాలు ఒక సారి దాఖలు చేసి మళ్లీ కార్యకర్తల కోలాహలం నడుమ మరో సెట్‌ నామినేసన్‌ దాఖలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

➡️