Apr 5,2024 08:50

పగలు ప్రచారాలు రాత్రి మంతనాలు..!

      అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో వారంతా ప్రచారాల్లో మునిగిపోయారు. సుర్రున మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి మునుపే ఓ విడత ప్రచారాలు ముగించేయాలన్న భావనతో కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నారు. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇదే సమయంలో అభ్యర్థులకు అసమ్మతి నేతల భయం పట్టుకుంది. ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని చోట్లా ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ చుట్టుకుంది. దీంతో అభ్యర్థులు వారిని మచ్చిక చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా టిడిపి, వైసిపిలో అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి రాగాలు విన్పిస్తున్నాయి. ఇందులో కొన్ని బహిర్గతం అవుతుండగా మరికొన్ని లోలోపలే జరుగుతున్నాయి. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా అసమ్మతి సెగలు ఉన్నాయి. టిడిపి విషయానికి వస్తే కళ్యాణదుర్గం, గుంతకల్లు, అనంతపురం అర్బన్‌, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎక్కువగా ఉంది. శింగనమల, పెనుకొండ, నియోజకవర్గాల్లో అసమ్మతి ఉన్నా అధిష్టానం సూచనతో అవి సర్ధుమనిగాయి. ఇక వైసిపిలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, పెనుకొండ నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు పార్టీల నేతలు అటు నుంచి ఇటు పార్టీ కండవాలు మార్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలను చేస్తున్నారు.

ఉదయం ప్రచారాలు

         ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా అభ్యర్థులు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉదయం 8గంటల కల్లా ప్రచారంలోకి దిగుతున్నారు. ఆయా ప్రాంతాల నేతలను వెంటబెట్టుకని అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అడుగతున్నారు. ప్రధాన ప్రాంతాల్లో సభలను నిర్వహించి వారి పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

అంతర్గత సమావేశాలు.. బుజ్జగింపులు..

          ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో అసమ్మతి నేతలను కలిసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అధికారం వస్తే న్యాయం చేస్తామంటూ వారికి హామీనిచ్చి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలను రాష్ట్ర నాయకులు పిలిచి మాట్లాడుతున్నారు. అలక వహించిన నేతల కోర్కోలన్నింటినీ తీరుస్తామనేలా అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు. అందరినీ సమన్వయం చేస్తూ గెలావలనే భావనలో నాయకులు ఉన్నారు. అయితే కొన్ని చోట్ల అసమ్మతి నాయకులు దారికొస్తుండగా, మరికొన్ని చోట్ల సహకరించేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఇలాంటి చోట అభ్యర్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ గ్రామం లేదా వార్డులో ప్రత్యర్థి పార్టీలో బలమైన నేతను తమ వైపునకు తిప్పుకునేలా పావులు కదుపుతున్నారు. ఇలా ఉదయం ప్రచారం రాత్రి బుజ్జగింపులతో ప్రచారాలు జరుగుతున్నాయి. నామినేషన్లు వేసేలోగా అసంతృప్తులను దారికి తెచ్చుకోవాలనేలా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.

➡️