Rahul Gandhi : విద్యాసంస్థలను కబలించిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌

  • లీకేజీలను ఆపలేకపోతున్న మోడీ సర్కార్‌
  • నీట్‌, నెట్‌ అక్రమాలపై నిలదీస్తాం
  • కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో విద్యావ్యవస్థను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ భ్రష్టు పట్టించాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. విద్యాసంస్థలను ఆ రెండూ పూర్తిగా కబలించాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్‌, నెట్‌ కుంభకోణాలపై పార్లమెంటులో ‘ఇండియా’ ఫోరం నిలదీస్తుందని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గాంధీ పలు అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌ జోడో న్యారు యాత్ర సందర్భంగా… దేశంలో నాన్‌స్టాప్‌ పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయని చాలా మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మీ అందరికీ తెలిసినట్టుగా నీట్‌, యుజిసి నెట్‌..2024 లీక్‌ అయ్యాయి. అందులో ఒకదాన్ని మాత్రమే కేంద్రం రద్దు చేసింది. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మోడీ ఆపారని చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది అలా ఉంచితే… దేశంలో పేపర్‌ లీకేజీలను మాత్రం మోడీ ఆపలేకపోతున్నారు” అని రాహుల్‌ ఘాటుగా విమర్శించారు. పదేళ్ల మోడీ పాలనలో ఉపాధి కరువైంది. ఉద్యోగాల్లేవు. పోటీ పరీక్షలు ఇలా లీకులతో రద్దవుతుంటే.. ఓడిపోయేది విద్యార్థులేనని ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు, ఏండ్లపాటు ప్రిపేరై పరీక్ష రాస్తే.. భావితరాల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని అన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం జరిగింది. ఇపుడు దేశమంతా లీకులు విస్తరించాయి. విద్యాసంస్థల హైజాకింగ్‌ జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చేతుల్లో విద్యావ్యవస్థ బందీ అయ్యింది. విద్య కాషాయికరణను మోడీ మరింత సులభతరం చేశారు. అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఇపుడు ఒక పరీక్షను రద్దు చేశారు. మరొకటి రద్దు చేస్తారో లేదో తెలియదు’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. లీకులు, రద్దుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతారా..? అని అడిగిన ప్రశ్నకు, ‘అవును, మేం దీన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాం’ అని గాంధీ చెప్పారు.

➡️