టిడిపి, వైసిపిలు బిజెపి తొత్తులు : ఇండియా వేదిక

Apr 24,2024 22:17

నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

                  పెనుకొండ రూరల్‌ : టిడిపి, వైసిపిలు బిజెపి తొత్తులుగా మారాయని ఇండియా వేదిక నాయకులు విమర్శించారు. ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పి. నరసింహప్ప బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. టి. శ్రీధర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌,సిపిఐ నాయకులు బాల స్వామి, న్యాయవాది లక్ష్మినారాయణతో కలసి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అపూర్వ భరత్‌కు నరసింహప్ప అందజేశారు. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశ సార్వభౌమాధికారాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ కాళ్లవద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ 10 సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధే తప్ప ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నియోజకవర్గంలో రూ. 50కోట్లు పెట్టుబడి పెట్టి రూ. 500 కోట్లు సంపాదించాలనే లక్ష్యం తో పోటీ చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరి, పెద్దన్న, వెంకటరాముడు, రాజగోపాల్‌, వెంకటేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విశ్వనాథ్‌ రెడ్డి, గంగాధర్‌ తోపాటు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️