ఇళ్ల నిర్మాణాల తొలగింపుపై పేదల ఆగ్రహం

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మటి ్ట చల్లి నిరసన తెలుపుతున్న మహిళలు

           సోమందేపల్లి : పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్‌ 668లో పేదలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు, పునాదులను అధికారుల అక్రమంగా తొలగించడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీన పెనుకొండలో ప్రభుత్వ భూములో పేదలు నిర్మించుకుంటన్న ఇళ్లు, పునాదులను అధికారులు జెసిబిలతో కూల్చివేశారు. దీనిపై సోమవారం నాడు నిరసనాగ్రహం కొనసాగింది. పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ముట్టడించారు. ఇళ్ల నిర్మాణాలు తొలగించిన వారిపై కోర్టు ధిక్కరణ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశార. అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు కార్యాలయం ముందు మట్టి చల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్‌ 668 ప్రభుత్వ స్థలంలో పేదలు పక్కా ఇళ్లు, పునాదులు నిర్మించుకున్నారన్నారు. ఉన్నపలంగా తహశీల్దార్‌ విజయరామరాజు, నగర కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌, సిఐ యుగంధర్‌లు వారి సిబ్బంది వచ్చి ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దౌర్జన్యంగా కూల్చివేతలను అధికారులు దగ్గరుండి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. దాదాపు రూ.25 లక్షల వరకు పేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాలను ఎవరు కూల్చేయమన్నారన్న దానిపై ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. పేదలకు న్యాయం చేయాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు వాటిని పట్టించుకోకుండా అక్రమంగా కూల్చివేతలు కొనసాగించారన్నారు. ఇది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తహశీల్దార్‌ స్పందిస్తూ ఇళ్ల కూల్చివేతపై వారం రోజుల్లో రాత పూర్వకంగా వివరాలు అందిస్తామన్నారు. నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పేదలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని ఇళ్ల తొలగింపులకు పాల్పడిన అధికారులపై కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవాలని కార్యాలయం ఏవో కాటంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఏవో ఫోన్‌ ద్వారా సబ్‌ కలెక్టర్‌కి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ మంగళవారం ఉదయం 10 గంటలకు పేదలు, నాయకత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నారాయణ సిపిఎం నాయకులు తిప్పన్న, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు వర్షిని, షబానా, నాగమణి, మంజుల, నరసమ్మ, సౌమ్య పాల్గొన్నారు.

➡️