వాల్టా… ఉల్టా

May 14,2024 21:33

ట్రాక్టర్‌లో అక్రమంగా తరలుతున్న కలప

                     హిందూపురం : ప్రభుత్వ స్థలాల్లో ఏపుగా పెరిగిన చెట్లతో పాటు రైతులు పెంచుకున్న చెట్లు సైతం అక్రమార్కులు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. వృక్షసంపద రోజురోజుకు తరిగిపోతుంది. వన సంరక్షణ ధ్యేయంగా నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ఉపయోగించే ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ప్రభుత్వ, అటవీ బీడు భూముల్లో మొక్కలు నాటినా, ఇందుకోసం ప్రభుత్వ ధనం కోట్ల రూపాయలు ఏటా వెచ్చించినప్పటికీ ప్రయోజనం శూన్యమే అవుతోంది. ప్రకతిని, వృక్ష సంపదను కాపాడటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వాల్టా చట్టం అటవీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉల్టా అవుతోంది. అక్రమంగా కలపను రవాణా చేయడాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే అటవీశాఖ అధికారులు మాత్రం స్మగ్లర్ల ఆటను మరింత ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. చెట్లను యథేచ్ఛగా నరికి రవాణా చేయడాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం ఉదేశ్యం నీరుగారిపోతుంది. చెక్‌పోస్టుల దాటి అక్రమంగా కలప రవాణా జరుగుతూనే ఉంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. హిందూపురం రూరల్‌ మండలం తూమకుంట, గోళాపురం పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షిలో ఉన్న పరిశ్రమ నిర్వహకులు యధేచ్చగా పరిశ్రమల్లో ఉన్నా బాయిలర్లకు అక్రమ కలపను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటికి వారి నుంచి అటవీశాఖ అధికారులు మామూళ్లు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారే తప్ప వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. అన్ని ఆధారాలతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికి చర్యలు తీసుకోవడం పక్కన పెడితే, ఏ ఒక్కరికి కనీసం నోటీసులు సైతం ఇవ్వడం లేదు. మరి కొంత మంది ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్రకృతి సంపదను అడ్డంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినపిస్తున్నాయి. నాడు అక్బర్‌ చక్రవర్తి చెట్లను పెంచి పకృతిని పెంచితే…హిందూపురం ప్రాంతంలో అటవీశాఖలో పని చేస్తున్న అదేపేరున్న ఓ అధికారి చెట్లను దగ్గరుండి నరికి సొమ్ము చేసుకుంటున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇతనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. చివరికి ఈ అవినీతి అధికారిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సైతం పర్యావరణ వేత్తలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికి ప్రభుత్వంలో కనీస చలనం కనిపించడం లేదు. కలపను ఇక్కడి నుంచి పావగడకు ఎగుమతి చేసుకుని అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా సబందిత అధికారులు పత్యేక దృష్టి సారించి చెట్లను సంరక్షించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.నేలకూలుతున్న భారీవృక్షాలు అక్రమార్కుల స్వార్థానికి భారీవృక్షాలు నేలకూలుతున్నాయి. శతాబ్దాల కాలం నాటి అతి పెద్ద చెట్లను సైతం అక్రమార్కులు నరికివేసి దుంగలను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇది గమనించిన కొందరు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా వారు ఆలస్యంగా వచ్చి చెట్లను లెక్కించి ట్రాక్టర్‌ లోడుకు రూ.7,500లు కట్టించుకుని రసీదు ఇచ్చి విడిచిపెడుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. వాస్తవానికి ఒక టన్నుకు రూ.17వేలు జరిమానా వేసి ట్రాక్టర్‌ సీజ్‌ చేయాల్సి ఉంది. దీనిని జిల్లా అటవీ శాఖ అధికారి పరిశీలన చేసి దీనికి అదనంగా జరిమానా వేయాల్సి ఉంది. అయితే తూతూ మంత్రంగా జరిమానా వేసి వెంటనే ట్రాక్టర్లను పంపుతున్నారు. ఇలా కలపను అక్రమంగా తరలిస్తున్న ప్రతిసారి అటవీశాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతూ దొరికినంత దోచుకుంటున్నారు. చెట్లకు రక్షణ ఏదీ..? భారీగా చెట్లను నరికి వేయడం వలన చెట్ల పరిరక్షణ కరువైంది. దీని వలన పచ్చదనం, ప్రాణవాయువు తగ్గిపోతోంది. కాలుష్యం పెరిగి వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, సోమందేపల్లి తదితర ప్రాంతాలలో అటవీ ప్రాంతం ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది. చెట్లను విపరీతంగా నరికి తరలించడం వలన అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో ఇక్కడ ఉంటున్న అడవి జంతువులు పల్లెలు, పట్టణాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది.ప్రస్తుత కాలంలోనే అడవి జంతువులు ప్రధాన రహదారులు, గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాస్త్తా కూస్తో అటవీ విస్తీర్ణం ఉండగానే జంతువుల ఇలా వస్తుంటే ఇక అడవులను పూర్తిగా నిర్వీర్యం అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరి.అటవీ శాఖలో అక్రమాలు చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని కొంతమంది స్వార్థ పూరిత అటవీశాఖ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కలప అక్రమ రవాణాను తమ అదాయ వనరుగా మల్చుకుని దొరికినంత దోచుకుంటున్నారు. ఇక చెక్‌పోస్ట్‌లు ఉన్నా అవి నామమాత్రమే. ప్రధానంగా చింత, వేప కానుక, మద్ది, వివిధ రకాల నీడనిచ్చే భారీ చెట్లను, ఫలాలు అందించే చింత కానుగ, వేప చెట్లను తెగనరికి తరలించేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించే చెట్లను నరికించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న వారికి ఫారెస్టు అధికారులు మొక్కుబడిగానే జరిమానాలు విధించి వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.అటవి, రెవిన్యూ శాఖల చేతిలో వాల్టా ఉల్టా పరిశ్రమలు, టింబర్స్‌ సామిల్లు, ఇటీక బట్టీల వారు చెట్ల దుంగలు, శతాబ్దాల కాలం నాటి చెట్లను తెగనరికి నిర్భయంగా ప్రధాన రహదారుల గుండా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల వద్ద అధికారులు, అటవీశాఖ, రెవెన్యూ అధికారులు నిద్రావస్థలో ఉన్నారన్న ఆరోపణలు పట్టణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. స్పందించని ఉన్నత అధికారులు హిందూపురం పట్టణంతో పాటు రూరల్‌ మండలం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల వ్యాప్తంగా ఫలాలు ఇచ్చే చెట్లతో పాటు నీడనిచ్చే చెట్లు, వలస పక్షులు బస చేసే ప్రాంతాల్లో ఉన్నా వందలాది చెట్లను సైతం అక్రమార్కులు తెగనరకి అక్రమంగా తరలిస్తున్నప్పటికి ఉన్నతాధికారుల్లో కనీస స్పందన లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టులు ఉన్నప్పటికి నామ మాత్రంగానే తనఖీలు చేస్తున్నారు. అక్రమంగా కలపను రవాణా చేస్తున్నా, అడవులు హరిస్తున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహించడం దారుణం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తును వీడి వృక్ష సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️