అండగా మేమున్నాం

అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటామని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు భరోసానిచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నాకు సంఘీభావం తెలుపుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా కార్మిక, ప్రజాసంఘాల ధర్నా

చెవిలో పువ్వులతో అంగన్వాడీల నిరసన

ప్రజాశక్తి – శ్రీకాకుళం యంత్రాంగం

అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటామని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు భరోసానిచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరింది. అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని 18 రోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీలపై బెదిరింపు ధోరణి మానుకొని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా అనేక సేవలందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదన్నారు. గ్రాట్యుటీ అమలు చేయాలని 2022లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా మన రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు. ధర్నాకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని వీడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుతో అంగన్వాడీల కుటుంబాలతో పాటు కేంద్రాల్లోని చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎస్‌.కిషోర్‌ కుమార్‌, చౌదరి రవీంద్ర, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు టి.త్రినాథ్‌ సంఘీభావం తెలిపారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి డి.గణేష్‌, ప్రజా సంఘాల నాయకులు బి.కృష్ణమూర్తి, కె.సూరయ్య, వరదరాజు, ఎ.సత్యనారాయణ, అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి, కొత్తూరులో అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. అంగన్వాడీల యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.సుధ, కె.లక్ష్మి, జలజాక్షి, వ్య.కా.స నాయకులు సిర్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పలాసలో సమ్మెకు యుటిఎఫ్‌ జిల్లా కార్యర్శి బి.చిట్టిబాబు సంఘీభావం తెలిపి రూ.ఐదు వేలు ఆర్థికసాయం అందజేశారు.కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు బి ఓంకార్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత తదితరులు పాల్గొన్నారు. పొందూరులో నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్థనరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, పి.భూలక్ష్మి, ఎం.లత తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు, రైతుసంఘం నాయకులు పి.సాంబమూర్తి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బి.రమణమ్మ, బి.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సచివాలయ సిబ్బంది అడ్డగింత ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురం అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ ఉద్యోగులు తెరిచారు. విషయం తెలుసుకున్న అంగ న్వాడీలు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లకీë నారాయణ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక కార్యదర్శి కె.అప్పారావు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అంగన్వాడీలు లేకుండా కేంద్రాన్ని ఎందుకు తెరుస్తారని స్థానికులు వారిని నిలదీశారు. దీంతో కేంద్రాన్ని మూసివేసి సచివాలయ ఉద్యోగులు వెళ్లిపోయారు.

 

➡️