అటకెక్కిన ఆధునికీకరణ

హిరమండలం మండలం గొట్టా బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెడుతున్న ఎడమ వైపు కాలువ పరిస్థితి

సరుబుజ్జిలి మండలం శ్యామలాపురం సమీపంలో కాలువ దుస్థితి (ఫైల్‌ ఫోటో)

పాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రతిపక్షంగా హామీ

అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించని వైనం

ఎనిమిదేళ్లుగా వంశధార మోడరనైజేషన్‌పై నిర్లక్ష్యం

నష్టపోతున్న ఆయుకట్టు రైతాంగం

ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రతిపక్షంగా హామీ ఇస్తున్న పార్టీలు ఆనక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసెత్తడం లేదు. దీంతో ఆ ప్రాజెక్టుల పనుల ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అటువంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల్లో వంశధార ఆధునికీకరణ పనులు ముఖ్యమైనవి. పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి మోడర్‌నైజేషన్‌ పనులు గురయ్యాయి. అప్పుడెప్పుడో నిర్మించిన కాలువలను పటిష్టం చేసేందుకు ఉద్ధేశించిన ఆధునికీకరణ పనులను విస్మరించడంతో శివారు భూములకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నా పాలకులకు పట్టడం లేదు. కుడి, ఎడమ కాలువలు బలహీనంగా ఉండటంతో గొట్టాబ్యారేజీలో నీటి నిల్వలు ఉంటున్నా సామర్థ్యం మేరకు నీరు వదల్లేని పరిస్థితి నెలకొంది. కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కొన్నిచోట్ల గండిపడిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

హిరమండలం మండలం గొట్టా బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెడుతున్న ఎడమ వైపు కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. కాలువ నుంచి 12 మండలాల పరిధిలోని 1,48,000 ఎకరాలకు సాగునీరందించేలా కాలువను నిర్మించారు. కాలువ నుంచి 2,480 క్యూసెక్కుల నీరు విడిచి పెట్టేలా కాలువను డిజైన్‌ చేశారు. బ్యారేజీలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజుల్లోనూ 1800 క్యూసెక్కులకు మించి విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. కాలువలు నిర్వహణ లేకపోవడం, గట్లు బలహీనంగా ఉండటంలో అంతకుమించి నీటిని వదిలితే గండికొట్టే ప్రమాదమూ లేకపోలేదు. కాలువ వాస్తవ సామర్థ్యం మేరకు నీటిని విడిచిపెట్టలేకపోవడంతో ప్రతి సంవత్సరమూ పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని వేలాది ఎకరాల భూములు ఎండిపోతున్నాయి. తుపాన్లు, నీటి ప్రవాహ ఉధృతికి క్రమేణా కాలువ గట్టు కోతకు గురవుతున్నాయి. 40 ఏళ్ల కిందట రాతితో నిర్మించిన నిర్మాణాలు ప్రస్తుతం దెబ్బతినడంతో ఎడమ కాలువ సామార్థ్యం అంతకంతకూ తగ్గిపోతోంది. ఎడమ కాలువను ఆధునికీరించాల్సిన అవసరముందంటూ గత తొమ్మిదేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపుతునే ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి తర్వాత మొదటి సారి 2016లో రూ.456 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత చివరి సారిగా 2018లో రూ.624 కోట్లతో పంపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లో మొదటిసారి పంపారు. 2021 మార్చిలో రూ.776 కోట్లతో, 2023 నవంబరులో రూ.954 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.రెండు పర్యాయాలు కోతకు గురయైన గట్లువంశధార కాలువలు, గొట్టాబ్యారేజీ ప్రాంతం ఎంత బలహీనమో రెండు సందర్భాల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు ఉదాహరణ. 2023 అక్టోబరులో వంశధారలో 80 వేల క్యూసెక్కు వరదనీరు ప్రవాహిస్తున్న సందర్భంలో బ్యారేజీ దిగువ కుడివైపుల గట్టు కోతకు గురైంది. గట్టును రూ.13.5 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అదేవిధంగా హిరమండలం అక్కరాపల్లి 2022 జూలైలో అండర్‌ టన్నల్‌ వద్ద కాలువకు గండి పడింది. దానినీ రూ.5 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలువలకు నీరు విడిచిపెట్టారు. వంశధార ఉధృతంగా ప్రవహిస్తే కాలువలు, గొట్టాబ్యారేజీ గట్లు ఎప్పుడు ఏవి కొట్టుకుపోతాయో అన్న పరిస్థితి నెలకొంది. తొమ్మిదేళ్లుగా నిరక్ష్యం చేసిన పాలకలు ఎన్నికలు వస్తుండటంతో టిడిపి, వైసిపిలు మరోసారి సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ఒక అజెండా మార్చి అవి పూర్తయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలు, రైతులపై ఉంది.

 

➡️