అభివృద్ధి కనిపించడం లేదా?

రాష్ట్రంలో అభివృద్ధిని చూసి

ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌

రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లని కళ్లు ఉన్నా చూడలేని వాళ్లని… చెవులు ఉండి వినలేని వాళ్లని, నిద్ర నటించే వాళ్లని ఏం అనగలమని దుయ్యబట్టారు. మండలంలోని శ్రీపురం పంచాయతీలో రూ.80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఉంటున్నారని చెప్పారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అదనంగా ఇక్కడ సిఎం పదవి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి హయాంలో జన్మభూమి కార్యకర్తలు దోచుకున్నారని ఆరోపించారు. పథకాల వర్తింపు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మభూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్లని చెప్పారు. ఇవాళ వివక్ష, కక్షసాధింపు ఉన్నాయని చెప్తున్న లోకేష్‌, గ్రామాలకు వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రజలకు లోకేష్‌, చంద్రబాబు ఎప్పుడో దూరమైపోయారని చెప్పారు. వాస్తవాలు గుర్తించకుండా అబద్దాలు, అన్యాయాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కొంతమంది సినీ నటులు అప్పుడప్పుడూ కనిపిస్తుంటారని, వాళ్లే వాలంటీర్లు వద్దని అంటున్నారని తెలిపారు. వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ పక్క రాష్ట్రంలో ఉన్న వారికి ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంలో 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చామన్నారు. 56 వేల ఉద్యోగాలను వైద్యారోగ్యశాఖలో భర్తీ చేశామని చెప్పారు. వీటి విషయమై ఎవరైనా, ఎక్కడైనా లంచం ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం రూ.200 కోట్లతో డయాలసిస్‌ సెంటర్‌, రూ.700 కోట్లతో ఉద్దాన ప్రాంతానికి రక్షిత మంచినీటి పథకం, రూ.నాలుగు వేల కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేశామని చెప్పారు. నేరడి బ్యారేజీపై ఒడిశాతో ఉన్న వివాదం కొలిక్కి రాకపోవడంతో గొట్టా దగ్గర లిఫ్ట్‌ పెట్టి ప్రాజెక్టును నింపబోతున్నామన్నారు. రూ.185 కోట్లతో చేపడుతున్న పనులు మరో నాలుగు నెలల్లో పూర్తవుతాయన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తే, వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజల ఖాతాల్లోకి నగదు వేసి ఆ కుటుంబం బాగుండాలని భావించామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి నిర్మల, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు, వైసిపి మండల అధ్యక్షులు చిట్టి జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️