ఆరో రోజు… ఆగని జోరు

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌

పొందూరు : సమ్మెలో పిల్లలతో కలిసి పాల్గొన్న అంగన్వాడీలు

  • ఉధృతమవుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
  • కళ్లు, చెవులు, నోరు మూసుకొని నిరసన
  • నేడు ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నాలు
  • సమ్మెకు మద్దతు తెలుపుతున్న అంగన్వాడీ లబ్ధిదారులు, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి – విలేకరుల యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. ఆదివారానికి సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆరు రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం, వినిపించడం, మాట్లాడడం లేదని కళ్లు, చెవులు, నోరు మూసుకొని వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా, అంగన్వాడీలు మాత్రం ఐక్యతతో సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు. తామేమీ కొత్తగా డిమాండ్లు చేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇస్తామన్న హామీలనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మరోవైపు సమ్మెకు మద్దతు పెరుగుతోంది. అంగన్వాడీ లబ్ధిదారులు పిల్లలతో కలిసి సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెన్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు కళ్లు, చెవులు, నోరు మూసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, బెదిరింపులు మానుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు తగ్గట్టు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా ఈనెల 18న ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, ఇ.అప్పలనరసమ్మ, జి.రాజేశ్వరి, కృష్ణభారతి, సుశీల తదితరులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం బస్టాండ్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరానికి పిల్లలతో కలిసి అంగన్వాడీ లబ్ధిదారులు వచ్చి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు హైమావతి, బాలామణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సోంపేట, కోటబొమ్మాళి ప్రాజెక్టు కార్యాలయాల వద్ద చేపట్టిన సమ్మె శిబిరాల్లో పిల్లలతో కలిసి అంగన్వాడీ లబ్ధిదారులు వచ్చి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పొందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో తమ పిల్లలతో కలిసి అంగన్వాడీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, కృష్ణవేణి, రమ తదితరులు పాల్గొన్నారు.పలాసలో కాశీబుగ్గ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరానికి వచ్చిన సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి టి.సన్యాసిరావు, ప్రజా కళాకారులు కె.హేమసూదన్‌, కె.బాలాజీరావు తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి తదితరులు పాల్గొన్నారు.

 

➡️