ఆర్థిక బకాయిల విడుదలకు ఉధృత ఉద్యమం

ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన

ధర్నాలో మాట్లాడుతున్న కిషోర్‌ కుమార్‌

  • యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌
  • కలెక్టరేట్‌ వద్ద 12 గంటల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిల విడుదల చేయకపోతే ఉధృత ఉద్యమం తప్పదని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌, కౌన్సిల్‌ సభ్యులు చౌదరి రవీంద్ర, గొంటి గిరిధర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక సంబంధ బకాయిల విడుదల కోరుతూ కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ధర్నా రాత్రి ఎనిమిది గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వస్తే ప్రతి నెలా ఒకటో తేదీన జీతం, మెరుగైన పిఆర్‌సి, సకాలంలో డిఎలు, ఉద్యోగ, ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణం ఉంటుందని 2019 ఎన్నికల్లో చెప్పారని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. మెరుగైన పిఆర్‌సి, సకాలంలో డిఎలు ఇవ్వకపోగా కనీసం ఒకటో తేదీన జీతం కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై శత్రుపూరిత వైఖరి అవలంభిస్తున్నారని చెప్పారు. సకాలంలో జీతాలు రాక బ్యాంకు ఇఎంఐలకు పెనాల్టీలు చెల్లించాల్సిన వస్తోందన్నారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌లు చెల్లించకపోవడంతో అత్యవసరాల సమయంలో అనేక కష్టాలు పడాల్సి వస్తోందని చెప్పారు. దీర్ఘకాలంగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతేడాది ఆగస్టు 24న నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సెప్టెంబర్‌ నాటికి అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకూ చెల్లించలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పిఆర్‌సి ఎరియర్లు రూ.6,246 కోట్లు, పిఆర్‌సి ముందు డిఎలు రూ.1136 కోట్లు, పిఆర్‌సి తర్వాత డిఎలు రూ.4,848 కోట్లు, పిఎఫ్‌ లోన్లు పార్ట్‌ ఫైనల్‌ పేమెంట్లు రూ.వెయ్యి కోట్లు, ఎపిజిఎల్‌ఐ ఫైనల్‌ పేమెంట్లు రూ.330 కోట్లు, ఇతర ఎరియర్లు రూ.4,500 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. వీటితో పాటు సిపిఎస్‌ ఉద్యోగుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా రూ.2,500 కోట్లు కొన్ని నెలలుగా చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సంబంధమైన బకాయిలను విడుదల చేయడంతో పాటు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం సంఘీభావం తెలిపారు. ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, కోశాధికారి డి.రవికుమార్‌, జిల్లా కార్యదర్శి హెచ్‌.అన్నాజీరావు, చిట్టిబాబు, ఎం.వాగ్దేవి, ఎన్‌జిఒ నాయకులు బడగల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️