ఎమ్మెల్యే దృష్టికి జీడి రైతుల సమస్యలు

జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఏటా ఇబ్బందులు

వినతిపత్రం అందజేస్తున్న రైతులు

ప్రజాశక్తి- పలాస

జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఏటా ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం జీడి రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీడి రైతులు డిమాండ్‌ చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బొడ్డపాడుకు చెందిన జీడి రైతులు ఎమ్మెల్యే గౌతు శిరీషకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం జీడి పిక్కలను కొనుగోలు కేంద్రాల ద్వారా 80 కేజీల బస్తా రూ.16 వేలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి, కొబ్బరి పంటలకు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వంశధార కాలువ ఉద్దాన గ్రామాల కలుపుతూ ఇచ్ఛాపురం వరకు పొడిగించాలన్నారు. రైతులు తీసుకున్న అన్నిరకాల రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. తిత్లీ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.7 వేలు పరిహారం అందించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిక్కర ఢిల్లీరావు, మాజీ సర్పంచ్‌ తామడ త్రిలోచన రావు, దాసరి శ్రీరాములు, రైతులు ఎం.మాధవరావు, గంగయ్య, తులసీరావు, టి.అప్పారావు, రాజాం గుణవంతు, రామారావు పాల్గొన్నారు.

 

➡️