ఆ ఎమ్మెల్యే మాకొద్దుఅజగన్‌ ముద్దు…

ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై అసమ్మతి గ్రూపు నాయకులు మరోసారి తమ గళం విప్పారు. ఆమెపై ఉన్న అసంతృప్తిని

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు

ఎమ్మెల్యే వద్దంటూ కొత్తూరులో ర్యాలీ

రెడ్డి శాంతికి టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తాం

అధిష్టానానికి వైసిపి అసమ్మతి నాయకుల ఆల్టిమేటం

ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రోజురోజుకీ అసమ్మతి తీవ్రతరమవుతోంది. పాతపట్నంలో ఈ నెల 1న నిర్వహించిన ‘మేం సిద్ధం…మా బూత్‌ సిద్ధం సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే బూత్‌ కమిటీ సభ్యుల సైతం హాజరు కాలేదు. ఇది ఇలా ఉండగా కొత్తూరులో బుధవారం నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ‘జగన్‌ ముద్దు… రెడ్డి శాంతి’ వద్దు అనే పేరుతో ర్యాలీ, సమావేశం నిర్వహించారు. దీనికి నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై తమ వ్యతిరేకతను వెలిబుచ్చారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, కొత్తూరు

ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై అసమ్మతి గ్రూపు నాయకులు మరోసారి తమ గళం విప్పారు. ఆమెపై ఉన్న అసంతృప్తిని కొత్తూరు కేంద్రంగా వెళ్లగక్కారు. పాతపట్నంలో ఈ నెల ఒకటో తేదీన ‘మేం సిద్ధం..మా బూత్‌ సిద్ధం పేరుతో నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఆమె ధీటుగా కొత్తూరులోని స్థానిక బుయ్యాల చిట్టిబాబు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్‌ ముద్దు… ఎమ్మెల్యే వద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. సర్వేలన్నీ ప్రతికూలంగా ఉన్నాయని, అధిష్టానం మళ్లీ ఆమెకే టికెట్‌ ఇచ్చే సాహసం చేస్తుందని తామనుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండి తన సొంత కుమారుడిని జడ్‌పిటిసిగా గెలిపించుకొలేని రెడ్డి శాంతి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. పాతపట్నం నియోజకవర్గంలో వైసిపి హ్యాట్రిక్‌ విజయం సాధించాలంటే స్థానిక అభ్యర్థి జిల్లా పార్టీ కోశాధికారి లోతుగెడ్డ తులసి వరప్రసాదరావును బరిలో దింపాలని నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో కోరారు. అభ్యర్థి ప్రకటన బట్టి తమ నిర్ణయం ఉంటుందని అధిష్టానానికి తేల్చి చెప్పారు. వైసిపి జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసీవరప్రసాదరావు మాట్లాడుతూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రెడ్డి శాంతిని మార్చి సరైన అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని చెప్పారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆమె ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. అధిష్టానం నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్దిని మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన నారాయణరావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బయ్యాల చిట్టిబాబు, హిర మండలం మండల పరిషత్‌ ప్రత్యేక అహ్వానితుడు తూలుగు తిరుపతిరావు, వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గంగు వాసు, కొత్తూరు ఎంపిపి సవర సావిత్రి రమేష్‌, వైసిపి మండల మాజీ అధ్యక్షుడు రేగేటి షణ్ముఖరావు, ఎంపిటిసి వీర్రాజు, పాతపట్నం మండల సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షులు మజ్జి భుజంగరావు, కొత్తూరు మండల వైసిపి మాజీ అధ్యక్షులు లోతుగెడ్డ తాతబాబు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సర్పంచ్‌, కొయిలాపు శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు బమ్మిడి జగన్నాథం, ఎం?శ్రీనివాసరావు, సంజీవరావు, రేగేటి కన్నయ్య, సుమారు 1500 మంది బూత్‌ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️