ఆ ఘనత మాదే… కాదు మాదే

Mar 4,2024 22:04

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు కొంత మేర వలసల నివారణకూ దోహదపడుతుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర విభజన సందర్భంగా వెనుకబడిన ఈ ప్రాంతంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలుకు దిక్కు లేకుండా పోయింది. బిజెపి చేసిన మోసంపై వైసిపి, టిడిపి నిలదీయకపోగా ఆ పార్టీతో పొత్తు కోసం పోటీ పడుతున్నాయి. కనీసం ఈ ప్రాంతంలో ఉన్నా నాయకులైనా ఈ పదేళ్లలో పోరాడారంటే అదీ లేదు. పైగా ఒక ప్యాసింజర్‌ రైలుకు హాల్ట్‌ వచ్చిందని బిజెపి, వైసిపి, టిడిపి సంబరపడిపోతూ ఆ ఘనత తమదంటే తమదంటూ మురిసిపోతున్నాయి. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బరంపురం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు కొత్తగా మంజూరైన ప్యాసింజర్‌ రైలు ఇచ్ఛాపురంలో నిలుపుదల క్రెడిట్‌ను అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఖాతాలో వేసుకునేందుకు పోటీపడ్డాయి. రైలు నిలుపుదల తమ పార్టీ గొప్పతనం అంటూ వైసిపి నాయకులు కాలరేగుస్తున్నారు. కాదు కాదు.. తమ పార్టీ ఎమ్‌పి రామ్మోహన్‌నాయడు చొరవ ఫలితమేనంటూ టిడిపి నాయకులు గొప్పలకు పోతున్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని, తమ వల్లే ప్యాసింజర్‌ రైలు నిలిపారని బిజెపి నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇచ్ఛాపురం ప్రాంతంలో వారం రోజులుగా పత్రికల్లో ప్రకటనలతోపాటు సోషల్‌ మీడియాలో ఇవే వాదనలతో హోరెత్తించారు. తాజాగా ఆదివారం రాత్రి తొలిసారిగా ఇచ్ఛాపురం చేరుకున్న బరంపురం ప్యాసింజర్‌ రైలుకు ఘన స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. లోకో పైలెట్‌కి సన్మానాలూ చేశారు. జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ ఆధ్వర్యాన వైసిపి శ్రేణులు భారీగా ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో స్టేషన్‌కు చేరుకుని, సందడి చేశారు. బిజెపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.నిర్మలారెడ్డి, అసి సత్యం ఆధ్వర్యాన ఆ పార్టీ కార్యకర్తలు అదేరోజు రాత్రి వచ్చి ట్రైన్‌ డ్రైవర్‌, స్టేషను మాస్టర్‌కి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. స్టేషన్‌కు రాలేకపోయిన టిడిపి నాయకులు మాత్రం ఖుర్దా డివిజనల్‌ సమావేశాల్లో ఎమ్‌పి రామ్మోహన్‌ నాయడు పలు దఫాలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్లే ఇచ్ఛాపురంలో బరంపురం ప్యాసింజర్‌ను నిలుపుదల చేశారని చెబుతున్నారు రైల్వేజోన్‌పై అడుగడుగునా మోసమేవిశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నా… దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం హామీని అమలు చేయడం లేదు. రైల్వేజోన్‌ ఏర్పాటు కోసం రకరకాల కుంటుసాకులు చెప్తోంది. విశాఖలో రెండు చోట్ల స్థలాలు సిద్ధంగా ఉన్నా రైల్వే జోన్‌ కోసం స్థలం ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నెపం పెడుతోంది. తప్పించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. తాత్కాలిక సిబ్బందినీ కేటాయించలేదు. కేంద్రంలోని బిజెపి సర్కారు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయవాడ డివిజన్‌ ఉండగా, వాల్తేరు రైల్వే డివిజన్‌ ఎందుకు? అంటూ బిజెపి పెద్దలు వాదించి విజయవాడ డివిజన్‌ వాల్తేరు డివిజన్‌లో సగభాగాన్ని కలిపించేశారు. మరి విజయవాడకు 40 కిలోమీటర్ల దూరానున్న గుంటూరుకు డివిజన్‌ ఉన్న విషయాన్ని విస్మరించారు. జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ వచ్చినంత మాత్రాన డివిజన్‌ ప్రధాన కార్యాలయాన్ని మూసేయ్యాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోల్‌కతా మాదిరిగా ఒక జోన్‌, ఒక డివిజన్‌ ప్రధాన కార్యాలయం ఒకేచోట ఉంటే తప్పేమిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసిపి, టిడిపి ఎమ్‌పిలు ఎవరూ పార్లమెంట్‌లో ఈ తరహా వాదనలను గట్టిగా వినిపించి విశాఖకు రైల్వే జోన్‌తోపాటు వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించే విషయంలో విఫలమయ్యారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. రైల్వే జోన్‌ హామీ అమలుపై పోరు మానేసి ప్యాసింజర్‌ రైలు కోసం మూడు పార్టీలు పోట్లాడుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి

➡️