ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని

పి.దుర్గారావు, ఆర్‌ఐఒ

సిసి కెమేరాల పర్యవేక్షణలో 113 కేంద్రాల్లో నిర్వహణ

210 మంది సిబ్బంది పర్యవేక్షణ

52 వేల మంది విద్యార్థులు రాసేందుకు సిద్ధం

ఆర్‌ఐఒ దుర్గారావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రగడ దుర్గారావు తెలిపారు. 113 పరీక్షా కేంద్రాల్లో ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో మాస్‌ కాఫీయింగ్‌, ఇతర రకాలైన అక్రమాలకు తావు లేకుండా పరీక్షా కేంద్రల్లో సిసి కెమేరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. వాటిని జిల్లాలో ఆర్‌ఐఒ, రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా అనుసంధానిస్తున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖాముఖిలో భాగంగా ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీసుకు తావులేకుండా చర్యలు ఎలా ఉండ బోతున్నాయి?పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి కేంద్రంలోనూ అన్ని గదుల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థుల ముఖచిత్రాలు వాటిలో నిక్షిప్తం చేయడంతో అభ్యర్థులపై నిఘా ఉంటుంది. సాంకేతిక నిపుణుల కమిటీ ప్రతి కేంద్రానికీ వెళ్లి కనెక్షన్‌ ఇస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వంద శాతం ఇవి పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలు జరుగుతున్న తీరును కమిషను కార్యాలయం నుంచే చూడడానికి వీలుంటుంది. చూచిరాతలు, పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారి విషయంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. విద్యార్థులకు అసౌకర్యాలు, ఇబ్బందులు కలిగితే స్పందించేందుకూ వీలుంటుంది. ఎన్ని కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు? జిల్లాలో 113 కేంద్రాల్లో 52 వేల మంది ఇంటర్మీడియట్‌ పరీక్షలు సిద్ధమయ్యారు. పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మానవ నైతిక విలువలపైన, పర్యావరణ విద్యపై పరీక్షలు ఉదయం 10 నుంచి ఒంటి వరకు మాత్రమే జరుగుతాయి. మిగిలిన పరీక్షలన్నీ నిబంధనలకు అనుగుణంగా నిర్ధేశించిన సమయాల్లో నిర్వహిస్తున్నాం. పరీక్షల నిర్వహణకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు? జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు కేంద్రాలను సిద్ధం చేశాం. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పూర్తి సమర్థతతో ఉన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఆయా ప్రాంతాల వారీగా సమయానుకూలంగా ఆర్‌టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందితో పాటు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతర మందులను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రశ్నాపత్రాల రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంటర్‌ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల భద్రత అత్యంత కీలకం. ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం, వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరచడం ఎంతో కీలకం. తీసుకువెళ్లే వాహనాలు వెంట పోలీసుల రక్షణ ఉంటుంది. అలాగే పరీక్షా కేంద్రాలకు దగ్గరలో జిరాక్స్‌ షాపులను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యమైతే వారిని అనుమతిస్తారా? నిర్ధేశించిన వేళల్లో జరిగే పరీక్షలకు అర గంట ముందే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. అనుకోని ఘటనలు ఎదురైతే వారికి పరీక్ష ప్రారంభమైన తరువాత 15 నిమిషాల వరకే లోపలకు అనుమతిచ్చేందుకు వీలుంటుంది. అనుకోని కారణాలతో బస్సు ఆలస్యం వంటి కారణాలకు మాత్రమే వెసులుబాటు కల్పించాలని బోర్డు నుంచి ఆదేశాలున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే వారికి ఎలాంటి కోడ్‌ అమలులో ఉంటుంది? పరీక్షల పర్యవేక్షణలో ఉన్న అథికారులకు గుర్తింపు కార్డుల జారీ చేస్తున్నాం. ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులే సెల్‌ఫోన్లను తీసుకెళ్లొచ్చు. వారూ ఆయా కేంద్రాల్లో ఫోన్‌ మాట్లాడడానికి వీల్లేదు. ఉన్నతాధికారులు ఫోన్‌ చేసేటప్పుడు మాత్రమే స్పందించాలి. ఇన్విజిలేటర్లు సెల్‌ ఫోన్‌ను తీసుకెళ్లకూడదు. కేంద్రాల్లో ఇతరులు ప్రవేశించకుండా సబార్డినేట్‌ నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్‌ వరకు అందరికీ ఐడీ కార్డులు జారీ చేస్తున్నాం. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారా? ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థుల కోసం జిల్లా కార్యాలయంలో ప్రత్యేక నియం త్రణ విభాగాన్ని (కంట్రోల్‌ రూమ్‌) ఏర్పాటు చేశాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేటప్పుడు, కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా 08942278151 నంబరును సంప్రదించాలని సూచనలు చేశాం. మరోవైపు ప్రతి కేంద్రంలోనూ సిసి కెమేరాలు ఉండేలా చూసుకోవాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. విధుల్లో 210 మంది ఎగ్జామినర్లు, 113 మంది చీప్‌ సూపరింటెండెంట్లు, ఆర్‌ఐఒ బృందం, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, డిఇసి కమిటీ, డిడిఇఒ బృందం పర్యవేక్షణ ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద సెల్‌ఫోన్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించాం. విధుల్లో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను తీసుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేశాం.

 

➡️