కిరణ్‌కే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని పలువురు వైసిపి నాయకులు కోరారు. మండల కేంద్రంలో

నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- రణస్థలం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని పలువురు వైసిపి నాయకులు కోరారు. మండల కేంద్రంలో గురువారం జెడ్‌పిటిసి టొంపల సీతారాం ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చెందిన ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌కు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అధిష్టానం నియమించి, ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్‌కే టికెట్‌ ఇవ్వాలని కోరారు. పార్టీలో చిన్నచిన్న విబేధాలు, వ్వతిరేకతలు ఉంటాయని, ఇది ఒక్క వైసిపిలోనే కాదని అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటాయన్నారు. కిరణ్‌కుమార్‌కు టిక్కెట్‌ ఇస్తే నియోజకవర్గ నాయకత్వం, పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై వచ్చి కిరణ్‌ కుమార్‌ను అత్యధిక మోజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. వలస నాయకులు వస్తే స్థానికులు ఆదరించరని, స్థానిక నాయకులకు మాత్రమే ఆదరిస్తారని, అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎచ్చెర్ల సీటు చేజారిపోతుందన్నారు. కొన్నేళ్లుగా పార్టీ జెండాలు మోసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్న స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్‌ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు లంకలపల్లి ప్రసాద్‌, రాయపురెడ్డి బుజ్జి, భవిరి రమణ, చిల్లా వెంకటరెడ్డి, పిన్నింటి సత్యం నాయుడు, గొర్లె అప్పలనాయుడు పాల్గొన్నారు.

 

➡️