కేసుల రాజీకి సహకరించాలి

వచ్చే నెల 9న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో మోటారు వాహన ప్రమాద కేసులను ఎక్కువగా రాజీ చేయాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

వచ్చే నెల 9న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో మోటారు వాహన ప్రమాద కేసులను ఎక్కువగా రాజీ చేయాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. కోర్టు సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అదాలత్‌లో ఎక్కువ క్రిమినల్‌ కేసులు రాజీ చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. కేసులు రాజీ చేసుకోవడం వల్ల పోలీస్‌ స్టేషన్లకు, కోర్టులకు పని భారం తగ్గుతుందన్నారు. పెద్ద పెద్ద కేసులు సీరియస్‌ ఆఫెన్సెస్‌ విషయంలో దృష్టి పెట్టడానికి అవకాశం దొరుకుతుందన్నారు. కక్షిదారుల మధ్య శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పబడుతుందన్నారు. సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు కక్షిదారులకు కౌన్సెలింగ్‌ చేసి ఎక్కువ కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లాలోని అదనపు జిల్లా జడ్జిలు శ్రీదేవి, మహేంద్ర, ఫణికుమార్‌, భాస్కరరావు, అడిషనల్‌ సీనియర్‌ జడ్జి అనురాధ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, అదనపు ఎస్‌పి తిప్పేస్వామి, పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

 

 

➡️