కొత్త సంవత్సర కానుక

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద ప్రభుత్వం

పలాస : పింఛను పంపిణీ చేస్తున్న ఎంపిడిఒ రమేష్‌ నాయుడు (ఫైల్‌)

* పింఛన్‌ ఇక రూ.మూడు వేలు

  • ఈనెల నుంచి రూ.250 పెంపు
  • జిల్లాలో 3,30,430 మందికి లబ్ధి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద ప్రభుత్వం ఈనెల నుంచి రూ.మూడు వేలు అందించనుంది. సామాజిక భద్రత పింఛన్ల కింద ప్రభుత్వం నెలకు రూ.2,750 అందిస్తోంది. ఇటీవల ఆ మొత్తానికి మరో రూ.250 కలిపి అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2019 జూన్‌ వరకు నెలకు రూ.రెండు వేల పింఛన్‌ ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. 2019 జులై నుంచి రూ.250 పెంచి రూ.2,250 కి పెంచిన ప్రభుత్వం దశల వారీగా రూ.మూడు వేలకు పెంచింది. ఈనెల మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు జిల్లాలో పింఛన్లు అందించనున్నారు. సామాజిక భద్రత కింద జిల్లాలో 16 రకాల పింఛన్లు అందిస్తుండగా, పెంచిన ఫించన్‌ను ఏడు కేటగిరీలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ఒంటరి మహిళలకు పింఛన్‌ పెరగనుంది. జిల్లాలో మొత్తం 3,30,430 మందికి పెంపు ప్రయోజనం కలగనుంది.కొత్తగా 9,650 పింఛన్లు మంజూరుజిల్లాకు కొత్తగా 9,650 పింఛన్లు మంజూరయ్యాయి. గత నెల 3,20,780 మందికి రూ.93.74 కోట్ల పింఛన్లు అందించగా, కొత్తగా మంజూరైన పింఛన్లతో కలిపి మొత్తం పింఛన్లు 3,30,430కి చేరింది. వీరికి రూ.99.12 కోట్లను అందించనున్నారు. దీనివల్ల జిల్లాలో రూ.5.38 కోట్ల భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెంచిన పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమరావతి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈనెల మూడో తేదీన ప్రారంభించనున్నారు.

 

 

➡️