గెలుపు ఊహల్లో ‘తమ్ముళ్లు’

వైసిపి ప్రభుత్వ పనితీరు, ఓటర్లు ఏమనుకుంటున్నారు వంటి అంశాలపై ఇటీవల ఓ సర్వే సంస్థ చేపట్టిన వివరాల్లో టిడిపి

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

వైసిపి ప్రభుత్వ పనితీరు, ఓటర్లు ఏమనుకుంటున్నారు వంటి అంశాలపై ఇటీవల ఓ సర్వే సంస్థ చేపట్టిన వివరాల్లో టిడిపి వైపే మొగ్గు అంటూ వార్తలు రావడంతో తెలుగు తమ్ముళ్లు అప్పుడే గెలుపు ఊహల్లో తెలియాడుతున్నారు. ఏ నియోజకవర్గం నాయకుడిని కదిపినా మేమే గెలుస్తామని ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, కింజరాపు కుటుంబం ఆశీస్సులు మెండుగా ఉన్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పలాసలో గౌతు శిరీషతో పాటు ఆమదాలవలసకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ నియోజకవర్గాల్లో పార్టీపరంగా సాఫీగా ఉంది. శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం ఇన్‌ఛార్జిలకు అసమ్మతి తలనొప్పిగా మారింది. నియోజకవర్గాల్లో ఆ రకమైన ఇబ్బందులకు కారణం పార్టీ పెద్దలేనన్న ఆగ్రహం ఉన్నా బయటకు కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో టిడిపి ఐవిఆర్‌ఎస్‌ సర్వే చేయాల్సి వచ్చిందన్న చర్చ నియోజవర్గ నాయకుల్లో సాగుతోంది. పార్టీ అధిష్టానం గత కొద్ది నెలలుగా ఐవిఆర్‌ఎస్‌ సర్వే ద్వారా గెలుపు అవకాశాలను పరిశీలిస్తోంది. జిల్లాలోని ప్రస్తుత ఇన్‌ఛార్జిలపై వ్యతిరేకత, నియోజకవర్గంలో టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్న మూడు నాలుగు పేర్లు సూచించి అభ్యర్థి ఎంపికపై అడుగుతున్నారు. రెండోసారి రెండు, మూడు పేర్లు సూచించి నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయమని కోరుతున్నారు. చివరి సర్వేలో ఒకటో ఆప్షన్‌గా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేరును, రెండో ఆప్షన్‌గా నోటాను సూచిస్తున్నారు. ఐవిఆర్‌ఎస్‌ సర్వే, క్షేత్రస్థాయి సర్వే తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారనే ప్రచారం సాగుతోంది.శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సైతం సర్వేను ఎదుర్కోవాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగానే పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదీ నియోజకవర్గంలో పెద్దగా పాపులారిటీ లేని గొండు శంకర్‌ను ఒక అభ్యర్థిగా సర్వేలో సూచించడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019లో టిడిపి అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర మనస్తాపంతో ఏడాది వరకు ఏ నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ వైఫల్యాలపై అధిష్టానం ఇచ్చిన పిలుపులకూ ఎవరూ స్పందించలేదు. చివరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో సైతం ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం గుండ లక్ష్మీదేవి, పార్టీ శ్రేణులతో పార్టీ నిర్ణయించిన నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలకు మాత్రం టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అప్పుడప్పుడు హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాలుగున్నరేళ్ల తర్వాత నియోజకవర్గంలో పర్యటించినా గుండ లక్ష్మీదేవి పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఇప్పటివరకు నియోజకరవర్గంలోని అన్ని గ్రామాలను నిరంతరం కలియ తిరుగుతూనే ఉన్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తూనే ఉన్నారు. జనం మధ్య ఉన్న నాయకులకు అసమ్మతి ఏమిటి, అప్పుడప్పుడు నియోజకవర్గం మొఖం చూసి వెళ్లిపోయిన నేతలకు అంతా సమ్మతిగానే ఉండటం నియోజకవర్గ నాయకులకు మింగుడు పడటం లేదు. పాతపట్నం, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో సర్వే సాగుతోంది. పాతపట్నంలో టిడిపి ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధిష్టానం కలమటకు అప్పగించింది. అక్కడ ఇన్‌ఛార్జికి ఇబ్బంది పెట్టేలా టిడిపి నాయకుడు మామిడి గోవిందరావు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. కలమటను వ్యతిరేకించే కొంతమంది నాయకులు గోవిందరావు పక్షాన చేరారు. నరసన్నపేటలో ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావుకే టిక్కెట్‌ వస్తుందని అంతా అనుకుంటున్న తరుణంలో పార్టీ పెద్దలు అక్కడ కొత్తగా మారో పేరును తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనయుడు, వైద్యులు బగ్గు శ్రీనివాసరావు కూడా టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో అక్కడి టిడిపిలో ఇబ్బంది మొదలైంది. ఎచ్చెర్లలో పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావు నియోజవకర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నా… పార్టీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వల్పంగానైనా పార్టీ కేడర్‌ కొంత అటు వెళ్లింది. నాలుగు నియోజకవర్గా ల్లోనూ టిక్కెట్‌ ఆశించో లేక పార్టీ పెద్దల ప్రోత్సాహం తో గ్రూపులు నిర్వహించో ఆశలు పెట్టుకున్న నాయకులు పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపునకు ఎంత వరకు సహకరిస్తారన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటివరకు తమకే టిక్కెట్‌ అంటూ ప్రచారం చేసుకుంటూ, సొంత పార్టీ నేతలపై కత్తులు దూసిన అసమ్మతి నాయకులు, అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులతో మునుపటిలా కలుస్తారా? అన్నది సందేహంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యం లో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జెండా ఎగురవేస్తామని, మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బయటకు చెప్పి, వేరే అజెండా అమలు చేస్తే మాత్రం జిల్లాలో పార్టీ నష్టపోయే ప్రమాదముంది. రాష్ట్రమంతా తిరిగి పార్టీ తగవులను తీరుస్తున్న అధ్యక్షుల వారు జిల్లాకు వచ్చే సరికి ఎందుకు చొరవ చూపడం లేదోనన్న సందేహాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిని చల్లార్చకుండా, గ్రూపుల పోరుకు చెక్‌ చెప్పకుండా అన్నింటిలో గెలుస్తామని భావించడం భ్రమే అవుతుంది.

➡️