గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం

ప్రచారం నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈనెల 16న చేపడుతున్న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. బంద్‌ జయప్రదం కోరుతూ మండల కేంద్రంలో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా 2014లో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మొత్తం ఉత్పత్తి ఖర్చులు, కుటుంబ శ్రమ విలువపై 50 శాతం ఉండేలా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్‌ సంస్థల నుంచి ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. విద్యుత్‌ సవరణ చట్టం ద్వారా విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. రైతు వ్యతిరేక మూడు చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుదీర్ఘకాలంగా సంయుక్త కిసాన్‌ మోర్చా చేస్తున్న డిమాండ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందన్నారు. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దుప్పాడ బంగార్రాజు, బి.రాము, పి.రామారావు, జి.శ్రీనివాసరావు, ఎల్‌.సీతారాం తదితరులు పాల్గొన్నారు.

➡️