‘చలో ఢిల్లీ’కి మద్దతుగా 14న నిరసనలు

ఈ నెల 14న రైతు సంఘాలు ఇచ్చిన చలో

మాట్లాడుతున్న తేజేశ్వరరావు

పిలుపునిచ్చిన రైతు, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఈ నెల 14న రైతు సంఘాలు ఇచ్చిన చలో ఢిల్లీకి మద్దతుగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని తిలక్‌ నగర్‌లోని అప్పారి వెంకట్రావు భవనంలో శుక్రవారం రైతు, కార్మిక, ప్రజా సంఘాల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల నాయకులు మాట్లాడుతూ 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ నెల 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభ ద్వారా దేశంలో 70 శాతం పైగా ఉన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి గొంతెత్తి నినదించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబరులో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలు దేరిన రైతాంగాన్ని హర్యానా సరిహద్దుల్లో అడ్డగించడం అన్యాయమన్నారు. బిజెపి ప్రభుత్వం రైతాంగంపై కర్కశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాలుగు సార్లు చర్చలు జరిపినా పురోగతి సాధించలేదని తెలిపారు. మంత్రులు ఇతర విషయాలు చర్చిస్తున్నారే తప్ప మద్దతు ధరల చట్టం గురించి మాట్లాడడం లేదన్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధరల చట్టం చేస్తే ప్రభుత్వంపై రూ.లక్షల కోట్లు ఆర్థిక భారం పడుతుందని అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక నిపుణులు ఇది నిజం కాదని చెపుతున్నా పెడ చెవిన పెడుతున్నారని విమర్శించారు. రద్దు చేసిన నల్ల చట్టాల విధానాలనే అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎరువులపై రాయితీల్లో కోతలు విధించడం, ఆహారభద్రత చట్టం అమలులో కోత విధించి కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకూ మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. 4 లేబర్‌ కోడ్లను రద్దు చేసి, కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీకి బడ్జెట్లో రూ. 2 లక్షల కోట్లు కేటాయించి, 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కూలి రూ.600లు పెంచాలని, రెండో పూట పని, ఆన్‌లైన్‌ మస్టర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్ఠ పరచాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని అన్నారు. కడప ఉక్కును ప్రభుత్వరంగం లోనే నిర్మించాలన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలన్నారు. స్మార్ట్‌ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించాలని, చుక్కల భూములు బంజరు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని అన్నారు. కౌలు రైతులకే నష్టపరిహారం, బీమా చెల్లించాలన్నారు. అటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరిం చాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వంశధార, బహుదా నదులు అనసంధానం చేసి ఇచ్ఛాపురం వరకు సాగునీరందిం చాలని కోరారు. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాద్‌, ఐద్వా జిల్లా కన్వీనర్‌ బి.లక్ష్మి, నాయకులు శ్రీదేవి పాణిగ్రాహి, శ్రామిక మహిళా జిల్లా కో-కన్వీనర్‌ ఎ.మహాలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హారీష్‌, చందు, పెన్షనర్స్‌ యూని యన్‌ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి సిఐటి యు పట్టణ నాయకులు ఆర్‌.ప్రకాశరావు పాల్గొన్నారు.

 

➡️