జిల్లాలో పనిచేయడం ఆనందం

శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం

మొక్కను అందజేస్తున్న కృష్ణదాస్‌

ఆత్మీయ వీడ్కోలు సభలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌గా బదిలీ అయిన ఆయనకు జిల్లా అధికారులు నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు పనిచేసినట్లు తెలిపారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. జిల్లాతో విడదీయరాని బంధం గురించి వివరించారు. తాను ఏ శాఖలో పనిచేసినా జిల్లాకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కలెక్టర్‌తో తనకున్న అనుబంధాన్ని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక గుర్తుచేసుకుని ఆయన సేవలను కొనియాడారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. ఎప్పట్నుంచో జిల్లాలో జరగని పనులు ఆయన సాధించినట్లు వివరించారు. తనతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఐటిడిఎ పిఒ కల్పన కుమారి మాట్లాడుతూ ఐటిడిఎ అభివృద్ధిలో తనవంతు సహాయ సహకారాలు అందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. సభలో టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు పలువురు నాయకులు, ఉద్యోగులు మంగళవారం వీడ్కోలు పలికారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబరులో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువతో సత్కరించారు. కలెక్టర్‌గా శ్రీకేష్‌ లాఠకర్‌ జిల్లా ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారని కృష్ణదాస్‌ అన్నారు. రెండున్నరేళ్లకు పైగా జిల్లాలో సేవలందించి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలైన నవరత్నాల పథకాలు అమలు చేయడంలో, జిల్లాలో చేపట్టిన కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారని కొనియాడారు. సమగ్ర భూ సర్వే, ఉపాధి హామీ అమల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారని ప్రశంసించారు. ఉద్యోగులు ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

 

 

➡️