టిక్కెట్లు ఎవరికో…!

జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట పాతపట్నం

నాలుగు చోట్ల సిట్టింగ్‌లపై వ్యతిరేకత

కొత్తగా నియమించిన సమన్వయకర్తలకు ఖరారయ్యేనా?

నేడు వైసిపి అభ్యర్థుల జాబితా విడుదల

రాబోవు ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా శనివారం వెలువడనుంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పులివెందులలో ప్రకటించనున్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించనుండటంతో సిట్టింగ్‌లు, సమన్వయకర్తలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అక్కడ మారుస్తారా? లేక వారినే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. రాబోవు ఎన్నికలకు కోసం వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అభ్యర్థులను మారుస్తూ వివిధ సందర్భాల్లో ఏడు జాబితాలను వెలువరిం చింది. ఆరో జాబితాలో జిల్లాలో ఇచ్ఛాపురం, టెక్కలి అసెంబ్లీ స్థానాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి సమన్వయకర్తలను నియమించారు. వీరికే ఆ సీట్లను ఖరారు చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట పాతపట్నం నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో గత కొంత కాలంగా ఎమ్మెల్యేల తీరుపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆమదాలవలస నియోజకవర్గంలో శాసన స్పీకర్‌ తమ్మినేని సీతారాం పరిస్థితి బాగోలేదు. నియోజకవర్గంలో కొంత కాలంపై తమ్మినేని కుటుంబం వైఖరిపై అసమ్మతి నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రధానంగా వైసిపి నాయకులు సువ్వారి గాంధీ, కోట గోవిందరావు, చింతాడ రవికుమార్‌ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమదాలవలసలో ఈ నెల 14న నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి చింతాడ రవి చివరిలో హాజరు కాగా మిగిలిన ఇద్దరు నాయకులు సమావేశానికి గైర్హజరయ్యారు. నరసన్నపేటలో వైసిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ సైతం తీవ్ర అసమ్మతిని ఎదుర్కుంటున్నారు. నియోజకవర్గంలో ధర్మానకు ఎటువంటి ఇబ్బంది లేదని అంతా అనుకుంటున్న తరుణంలో అన్ని మండలాల నాయకులు ఇటీవల నరసన్నపేటలోని ఓ కళ్యాణ మండపంలో సమావేశమై కృష్ణదాస్‌ ఒంటెత్తుపోకడలు, కుటుంబం వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. ధర్మానకు టిక్కెట్‌ ఇవ్వొద్దని, కొత్త వారికి ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా గెలుపు కోసం ఐక్యంగా పనిచేస్తామని అసమ్మతి గ్రూపు నాయకులు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. కృష్ణదాస్‌కు టిక్కెట్‌ ఇస్తే మాత్రం తాము సహకరించమని తేల్చి చెప్తున్నారు. పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తాము భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటూ అధిష్టానానికి ఆల్టిమేటం సైతం ఇచ్చారు. ఆ రెండు నియోజకవర్గాల్లో తీవ్ర అసమ్మతిఎచ్చెర్లకు సంబంధించి ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను తీవ్ర అసమ్మతిని ఎదుర్కుంటున్నారు. ఎమ్మెల్యేను మార్చాలంటూ కేడర్‌ రోడెక్కిన పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే తమ దారి తాము చూసుకుంటామంటూ అసమ్మతి నాయకులు ఆల్టిమేటం సైతం ఇచ్చారు. అసమ్మతిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. విజయనగరం జడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కే అధిష్టానం సీటు కేటాయిస్తుందని ఎమ్మెల్యే వర్గం చెప్తున్నారు. అధిష్టానం అభ్యర్థి ఎవరనే విషయం ప్రకటించే వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై అసమ్మతి ఇటీవల కాలంలో మరింత పతాక స్థాయికి చేరింది. కొత్తూరులో ఇటీవల రెడ్డి శాంతికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసీవరప్రసాదరావును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పాతపట్నంలో ఈ నెల 14న ఎమ్మెల్యే రెడ్డి శాంతి నిర్వహించిన సమావేశాన్ని నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు గైర్హజరయ్యారు. అభ్యర్థి ప్రకటన తర్వాత అసమ్మతి జ్వాలలు మరింత ఎగిసిపడనున్నాయి.కొత్త సమన్వయకర్తలకు ఖరారయినట్టేనా?రాబోవు ఎన్నికలకు కోసం వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అభ్యర్థులను మారుస్తూ వివిధ సందర్భాల్లో ఏడు జాబితాలను వెలువరించింది. అందులో జనవరి 11న వెలువరించిన ఆరో జాబితాలో జిల్లాకు సంబంధించి ఇచ్ఛాపురం, టెక్కలి అసెంబ్లీ స్థానాలతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీటుకు సమన్వయకర్తలను ప్రకటించింది. ఇచ్ఛాపురం స్థానానికి జడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, టెక్కలికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్‌ను సమన్వయకర్తలుగా నియమించింది. పార్టీ నియమించిన సమన్వయకర్తలంతా అభ్యర్థులు కారంటూ వైసిపి ఉత్తరాంధ్ర వైసిపి రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి జాబితా ప్రకటించిన తర్వాత కేడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. కొత్త సమన్వయకర్తలకు సీటు ఖరారవుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ స్థానాల వరకు మార్పు లేకపోయినా ఎంపీ స్థానానికి అభ్యర్థిని మార్చొచ్చనే ప్రచారం సాగుతోంది.

➡️