ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలి

ధాన్యం కొనుగోళ్లలో

మాట్లాడుతున్న మోహనరావు

  • రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టి, రవాణా ఛార్జీలను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. నగరంలోని రైతుసంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా, మిల్లర్లు 80 కేజీలకు బదులు 82 నుంచి 85 కేజీల వరకు తీసుకుంటున్నారని, తేమశాతం ఎక్కువగా చూపించి ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీలు, ధాన్యం దించడానికి బస్తాకు రూ.15 నుంచి రూ.17 వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల బస్తా ధాన్యం మిల్లుకు చేరవేతకు రైతుకు రూ.150 వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఈ ఛార్జీలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో సాగవుతున్న జీడి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు పది నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పలాస పర్యటనకు వచ్చిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి జీడి రైతుల సమస్యలను తీసుకెళ్లినప్పుడు అమరావతి వస్తే చర్చించి రైతులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. నెల రోజులు గడిచినా అధికారులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా, రైతుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ధర ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు సంఘం జిల్లా నూతన అధ్యక్షునిగా పొందూరు చందరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కె.కొండయ్య, బి.వాసుదేవరావు, కె.పుణ్యవతి, టి.నందోడు తదితరులు పాల్గొన్నారు.

 

➡️