నేడు డీ వార్మింగ్‌ డే

నేడు డీ వార్మింగ్‌ డే

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి తదితరులు

  • విద్యార్థులందరికీ మాత్రలు వేయాలి
  • జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల తొమ్మిదో తేదీన డీవార్మింగ్‌ డే సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు ఆల్బెండాజోల్‌ మాత్రలు తప్పనిసరిగా నమిలి తినిపించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని ఆమె ఛాంబరులో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయన్న అపోహను తొలగించాలన్నారు. తద్వారా ప్రతి విద్యార్థి మాత్రలు వేసుకునేందుకు ముందుకొస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి రెండేళ్ల వరకు సగం మాత్ర, మూడు నుంచి 19 ఏళ్ల వరకు విద్యార్థులతో పాటు పాఠశాల, కళాశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీల ద్వారా మాత్రలు వేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి ఒక మాత్రను వైద్యారోగ్య, విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలన్నారు. జిల్లాలో మొత్తం 4,54,835 మందికి మాత్రలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షకుడిగా నియమించినట్లు తెలిపారు. ఈనెల 16న మాప్‌ అప్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా సమన్వయకర్త సి.పి శ్రీదేవి, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త ప్రకాష్‌, వెంకటలక్ష్మి, ప్రవీణ్‌, సుజాత, ప్రోగ్రాం మేనేజర్‌ అప్పలనాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️