నేరాలు తగ్గాయి కానీ..

జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు.. దొంగతనాలు, ఆత్మహత్యలు పెరిగాయి. అగ్ని ప్రమాదాల్లో మృత్యువాత, కాలిపోవడంలోనూ పెరుగుదల కనిపిస్తోంది. మహిళలపై నేరాలు తగ్గడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. పోక్సో చిన్న పిల్లలపై లైంగిక నేరాలూ

ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరిగాయి

దొంగతనాలు కూడా…

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు.. దొంగతనాలు, ఆత్మహత్యలు పెరిగాయి. అగ్ని ప్రమాదాల్లో మృత్యువాత, కాలిపోవడంలోనూ పెరుగుదల కనిపిస్తోంది. మహిళలపై నేరాలు తగ్గడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. పోక్సో చిన్న పిల్లలపై లైంగిక నేరాలూ తగ్గాయి. వైట్‌ కాలర్‌ నేరాలూ తగ్గుముఖం పట్టాయి. మిస్సింగ్‌ కేసుల నమోదూ తగ్గాయి.జిల్లాలో 2021, 2022తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గింది. 2021లో 5,022 కేసులు నమోదు కాగా, 2022లో 5,071 కేసులు నమోదయ్యాయి. 2023లో 4,618 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం మహిళలపై దాడులు 18 శాతం మేర తగ్గాయి. గతేడాది 597 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 506 నమోదయ్యాయి. ఎస్‌సి, ఎస్‌టిలపై 2022లో 56 కేసులు రాగా 2023లో 64 వచ్చాయి. 2022లో 434 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది 482 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వైట్‌ కాలర్‌ నేరాలు 11 శాతం మేర తగ్గాయి. గతేడాది 242 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 219 కేసులు దాఖలయ్యాయి. ఆస్తి దొంగతనాలు 2022లో 252 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 267 వెలుగు చూశాయి. హత్య కేసులు 2022లో 24 నమోదు కాగా ప్రస్తుతం 25 నమోదయ్యాయి. కిడ్నాప్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఎనిమిది నమోదు కాగా, ఈ ఏడాది ఆరు నమోదయ్యాయి.మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గుముఖంమహిళపై పలురకాల వేధింపులకు సంబంధించి 2022లో 597 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 506 కేసులు నమోదయ్యాయి. ఇందులో వరకట్న వేధింపు మరణాలు 2022లో రెండు నమోదు కాగా, ఈ ఏడాది మూడు నమోదయ్యాయి. మహిళలను ఆత్మహత్యకు పురిగొల్పడంపై రెండు సంవత్సరాల్లోనూ 12 చొప్పున నమోదయ్యాయి. వరకట్న వేధింపు నేరాలు కొంత తగ్గాయి. 2022లో 362 నమోదు కాగా 2023లో 351 నమోదయ్యాయి. ఈ ఏడాది అత్యాచారం కేసు ఒకటి నమోందైంది. నమ్మించి మోసం చేసిన కేసులు గతేడాది 25 నమోదు కాగా, ఈ ఏడాది ఏడు వెలుగు చూశాయి. పోక్సో చిన్న పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి 2022లో 46 నమోదు కాగా ఈ ఏడాది 36 నమోదయ్యాయి.పెరిగిన గంజాయి, మాదకద్రవ్యాల రవాణాగంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఈ ఏడాది జోరుగానే సాగింది. 2022లో 11 కేసులు నమోదు కాగా, 2023లో 19 కేసులు నమోదయ్యాయి. పేకాట నేరాలు బాగా పెరిగాయి. గతేడాది 209 నమోదు కాగా, ఈ ఏడాది 273 నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓవర్‌ లోడ్‌ కేసులు మూడున్నర రెట్లు పెరిగాయి. 2022లో 577 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2005 కేసులు వెలుగు చూశాయి. ఖైనీ, గుట్కా అక్రమ రవాణా కొంతమేర తగ్గాయి. 2022లో 104 నమోదు కాగా, ఈ ఏడాది రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తగ్గిన రోడ్డు ప్రమాదాలురోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకున్న చర్యలు కొంతమేర సత్ఫలితాలనిచ్చాయి. క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు, జాతీయ రహదారిపై ముఖ్య కూడళ్ల వద్ద పోలీసులను విధులకు నియమించడం, అవసరమైన చోట్ల స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు, బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించడంతో వంటి చర్యలతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగా నమోదు చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది 814 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది 793 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 282 మంది చనిపోయారు.సమిష్టి కృషితో నేరాల అదుపు : ఎస్‌పి రాధికపోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో నేరాలను కట్టడి చేయగలిగామని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక చెప్పారు. ఎస్‌పి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు పలురకాల కౌన్సెలింగ్‌లు నిర్వహించడం, నేరాలపై అవగాహనా సదస్సులు, ముందస్తు నిఘాతో పాటు సమాచార సేకరణల ద్వారా గతేడాది పోలిస్తే నేరాలు బాగా తగ్గాయన్నారు. జిల్లావ్యాప్తంగా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది 1,637 సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్‌ఇబి, పోలీసు శాఖల సమన్వయంతో మద్యం, ఇసుక, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటు, దాడులతో అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు చాలావరకు తగ్గించామని చెప్పారు. జిల్లాలో ప్రత్యేకంగా కళాశాల విద్యార్థుల కోసం ‘క్యాంపస్‌ కాప్స్‌’, ప్రభుత్వ వసతిగృహ విద్యార్థుల కోసం సీనియర్‌ సిటిజన్లతో ఏర్పాటు చేసిన ‘చిన్నారికి చేదోడు’ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా జాగృతి వాలంటీర్లను నియమించి, విలేజ్‌ కమిటీల ద్వారా గ్రామాల్లో నేరాల నివారణకు చర్యలు చేపట్టామని వివరించారు.ప్రశాంతంగా కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవాలిప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్‌పి సూచించారు. ప్రధాన రహదారి మార్గాల్లో మద్యం సేవించి వాహనం నడపడం, ప్రజలకు ఇబ్బందికరంగా బహిరంగ ప్రదేశాల్లో డిజె సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️