నేల సంరక్షణతోనే భూసారం

మనిషి ఉనికికి, జీవనానికి మూలాధారమైన నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ అన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌-వ్యవసాయ శాఖ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే

రణస్థలం : మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌

ప్రజాశక్తి – రణస్థలం

మనిషి ఉనికికి, జీవనానికి మూలాధారమైన నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ అన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌-వ్యవసాయ శాఖ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే జీవకోటిని పోషించడానికి కావాల్సిన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విచక్షణారహితమైన మానవ కార్యకలాపాల వల్ల నేలపై పొరలు నానాటికీ దెబ్బతింటున్నాయని తెలిపారు. దీనివల్ల ఆహార ఉత్పత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆత్మ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రామచంద్రరావు అన్నారు. రైతులు విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడకం తగ్గించాలని, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆమదాలవలస సహాయ సంచాలకులు సత్యవతి, కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త అనూష, డాక్టర్‌ బాలకృష్ణ, రణస్థలం ఎడిఎ వి.శ్రీనివాసరావు, జిల్లా వనరుల కేంద్రం వై.సూర్యకుమారి, ఎఒ విజయభాస్కర్‌, రెడ్డీస్‌ ఫౌండేషన్‌ డిప్యూటీ మేనేజర్‌ ఆర్‌.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌ : జీవుల మనుగడకు ప్రధాన అవసరాలైన నేల, నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజలను జాగృతం చేయాలని నైర వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ అన్నారు. ప్రపంచ నేల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ వర్షపునీరు భూమిలోకి ఇంకకపోతే వరద ప్రవాహంగా మారుతుందని, వరదల వల్ల నేల కోతకు గురై బీడుగా మారుతుందన్నారు. దీనివల్ల ఉత్పాదక శక్తి, భూసారం కోల్పోవడం, ఆహారోత్పత్తి తగ్గుతుందన్నారు. రానున్న రోజుల్లో ఆహార భద్రత కొరవడుతుందన్నారు. దేశంలో 65 శాతం భూభాగం వర్షాధారంపైనే సాగవుతోందని, వర్షపునీటిని సద్వినియోగం ద్వారా పంటదిగుబడి పెంచవచ్చన్నారు. మృత్తికా విభాగం యూనివర్సిటీ అధిపతి డాక్టర్‌ పి.గురుమూర్తి మాట్లాడుతూ మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి కంపోస్టు ఎరువుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఆమదాలవలస : పంట పొలాల భూసారాన్ని కాపాడాలని మండల ఎఒ మెట్ట మోహనరావు అన్నారు. మంగళవారం మండలంలోని దూసి రైతుభరోసా కేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఆశాజనకమైన పంటలతో పాటు భవిష్యత్‌ తరాలకు సరిపడే భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎఇఒ రమణమూర్తి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అలేఖ్య, రైతులు పాల్గొన్నారు.బూర్జ : ప్రతి ఒక్కరు నేలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ నూక సన్యాసిరావు అన్నారు. నేల దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దపేట గ్రామంలో ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️